Telugu Gateway
Andhra Pradesh

బీజేపీ డబల్ గేమ్ ఆడుతుందా?

బీజేపీ డబల్ గేమ్ ఆడుతుందా?
X

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అటు బీజేపీ కి..ఇటు ప్రధాని మోడీ కి ఏ మాత్రం కీలక కాదు. కానీ వచ్చే ఎన్నికల్లో గెలవటం టీడీపీ, జనసేన కు మాత్రం ఎంతో కీలకం. రాజకీయాల్లో ఇప్పుడు పొత్తులను రాజకీయ అవసరాలే డామినేట్ చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే పాత విషయాలు అన్నీ మర్చిపోయి మరో సారి టీడీపీ, జనసేన, బీజేపీ లు కూటమి కట్టాయి. ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ వల్ల పెద్దగా ఏదో ఓట్లు వస్తాయనే ఆశ ఎవరికీ లేదు. కానీ బీజేపీ అండ ఉంటే వ్యవస్థలు ఎంతో కొంత సహకరిస్తాయి అన్నది టీడీపీ, జనసేన ల ఆశ. కానీ ఆదివారంనాడు చిలకలూరిపేటలో జరిగిన కూటమి తొలి సభ లో ప్రధాని మోడీ ప్రసంగం చూసిన తర్వాత టీడీపీ కి చెందిన నేతల్లో కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మూడు పార్టీల మధ్య పొత్తు ఫైనల్ కాకముందు ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె పీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లు గతంలో జగన్ సర్కారు పై తీవ్ర విమర్శలు చేశారు. నేరుగా జగన్ టార్గెట్ గా వీళ్ళ విమర్శలు సాగాయి అప్పటిలోనే . కానీ ఎన్నికల వేళ మోడీ చిలకలూరిపేట మీటింగ్ చూస్తే మాత్రం ఆయన జగన్ విషయంలో చాలా చాలా సాఫ్ట్ కార్నర్ చూపించారు అనే చర్చ టీడీపీ నేతల్లో సాగుతోంది. జగన్ మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారు అంటూ ప్రధాని మోడీ విమర్శలు చేశారు. అంటే మంత్రుల అవినీతిని సీఎం జగన్ ప్రోత్సహించారా?, లేక పోతే మంత్రుల పై జగన్ కు కంట్రోల్ లేదా?. అవినీతి చేసిన మంత్రులను జగన్ చూసీ చూడనట్లు వదిలేశారు అని మోడీ చెప్పదల్చుకున్నారా? అన్న ప్రశ్నలు ఉదయించటం సహజమే. గత ఐదేళ్ల కాలం లో ఆంధ్ర ప్రదేశ్ లో పాలన అంతా సీఎం జగన్ కేంద్రంగా..జగన్ చుట్టూనే సాగిన విషయం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ మోడీ మాత్రం జగన్ గురించి మౌనంగా ఉండి...జగన్ మంత్రులు మాత్రం అవినీతి చేశారు అని చెప్పటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ మారింది.

ఇది ఇలా ఉంటే టీడీపీ, జనసేన తో పొత్తుకు రెడీ అయిన బీజేపీ వచ్చే ఎన్నికల్లో తమ కూటమి గెలిస్తే ఏమి చేస్తుంది అనే విషయాలపై ప్రధాని హోదాలో ఉన్న మోడీ ఒక్కటంటే ఒక్క స్పష్టమైన హామీ ఏమీ ఇవ్వలేదు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంతో పాటు ఇప్పుడు జగన్ సీఎం గా ఉన్న సమయంలో కూడా విభజన హామీల అమలు విషయంలో మోడీ సర్కారు ఏపీకి ఏ మాత్రం సహకరించలేదు అనే విమర్శలు ఉన్నాయి. అయినా సరే ప్రధాని మోడీ నోట కూటమి కి అత్యంత కీలకమైన రాజధాని అమరావతి విషయం కానీ..పోలవరం ప్రాజెక్ట్ వంటి వాటిపై మోడీ మౌనం దాల్చటం పలు అనుమానాలకు తావిస్తోంది. పైగా ఆంధ్ర ప్రదేశ్ లో అంతగా ప్రభావం చూపించే స్థితిలో లేని కాంగ్రెస్ పార్టీ పై..షర్మిల పై మోడీ విమర్శలు చేయటం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. కూటమి తరపున జరిగిన తొలి మీటింగ్ చూసిన వాళ్ళు మోడీ పొత్తుతో ముంచుతారా..తేల్చుతారా అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. పొత్తుల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ఆయనకు అక్కడ స్పష్టమైన హామీ దక్కినట్లు వైసీపీ నేతలు కూడా చెపుతున్నారు. అందులో భాగంగానే జగన్ కూడా నేరుగా ఎప్పుడూ మోడీ ని విమర్శించరు..ఇప్పుడు మోడీ కూడా జగన్ పై ఎటాక్ చేయకుండా మంత్రులు రూట్ లో వెళ్లారు అనే చర్చ సాగుతుంది. మరో వైపు ముఖ్యంగా లోక్ సభ సీట్లకు సంబంధించి అటు వైసీపీ గెలిచినా...ఇటు టీడీపీ కూటమి గెలిచినా అన్నీ బీజేపీ కూటమికే చేరతాయి అనే లెక్కలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇది అంతా కూడా ఫైనల్ గా జాతీయ స్థాయిలో ఏ పార్టీ కి ఎక్కువ సీట్లు వస్తాయి అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది.

Next Story
Share it