పెట్టుబడులకు ఫ్లైట్ కనెక్టివిటీ కావాలి

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అమరావతి విస్తరణ కోసం కొత్తగా వేల ఎకరాల భూమి సమీకరించాలని ప్రతిపాదించటంపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఇంత వరకు అసలు తొలి దశ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో పట్టాలు ఎక్కలేదు కాని...అప్పుడే రెండవ దశ కోసం ఏకంగా దగ్గర దగ్గర 45 వేల ఎకరాలను సమీకరించాలని ప్రతిపాదించటంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఏ మాత్రం సమర్ధనీయం కాదు అనే అభిప్రాయాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. అమరావతి కి భూములు ఇచ్చిన రైతుల్లో కొంత మంది తమకు ఇప్పటివరకు డెవలప్ చేసిన ప్లాట్స్ ఇవ్వకుండా ఇప్పుడు రెండవ దశ అంటూ తమను ఏమి చేయదల్చుకున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీన్ని కవర్ చేసుకునేందుకు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చేసిన ప్రయత్నాలు ఏమి పెద్దగా వర్క్ అవుట్ కాలేదు అనే చెప్పాలి. విదేశాల నుంచి వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే ఫ్లైట్ కొనేసిటివిటీ ఉండాలి ..అందుకే అమరావతిలో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం కట్టాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన అంటూ చెప్పుకొచ్చారు.
ఒక వైపు గన్నవరం విమానాశ్రయం విస్తరణ కొనసాగుతోంది. దీనిపై కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ కు అమరావతికి అసలు ఎంత దూరం ఉంటుంది?. కనెక్టివిటీ కోసమే కదా ఒక వైపు ఔటర్ రింగ్ రోడ్ , ఇన్నర్ రింగ్ రోడ్ అనేది . గన్నవరం ఎయిర్ పోర్ట్ లో దిగి పారిశ్రామివేత్తలు అమరావతిలో పెట్టుబడులు పెడతాం అంటే ఎవరైనా వద్దు అంటారా? అమరావతి తొలి దశ పూర్తి అయి వియజయవాడ విమానాశ్రయంలో ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ రెట్టింపు కావటానికి ఇంకా తక్కువలో తక్కువ పదేళ్ల సమయం పడుతుంది అని..పైగా గన్నవరం విమానాశ్రయం విస్తరణకు ఇంకా ఎంతో అవకాశం ఉంది అని అధికార వర్గాలు చెపుతున్నాయి.
ఇవన్నీ పక్కన పెట్టి అసలు అమరావతిలో ఇంకా ఏమి లేనప్పుడే రైతుల దగ్గర నుంచి ఐదు వేల ఎకరాలు తీసుకుని ప్రైవేట్ కంపెనీలకు అప్పగిస్తే వాళ్ళను ఫోర్బ్స్ లిస్ట్ లో చేర్చటం తప్ప ..అక్కడ రైతులకు..ప్రజలకు పెద్దగా ఉపయోగం ఉండదు అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు . ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అమరావతిలో గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఏ మాత్రం సరైన ఆలోచన కాదు అన్నది ఎక్కువ మంది చెపుతున్న మాట . రాజధాని అమరావతి పై కొంత మంది అపోహలు సృష్టిస్తున్నారు అని అని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త భూసేకరణ విషయాన్ని తెర మీదకు తెచ్చి సాఫీగా సాగుతున్న అమరావతి పనులను ప్రభుత్వమే గందగోళంలోకి నెడుతోంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి .