Telugu Gateway
Andhra Pradesh

ప్రాజెక్టుల్లో దోపిడీనే కాదు ...అక్రమ మైనింగ్ లోనూ మేఘా హ్యాండ్

ప్రాజెక్టుల్లో దోపిడీనే కాదు ...అక్రమ మైనింగ్ లోనూ మేఘా హ్యాండ్
X

గనుల శాఖ పెనాల్టీ నోటీసులు లైట్ తీసుకున్న కంపెనీ

వ్యవహారం ఇప్పుడు ఎన్ జీటి కి

భారీ జరిమానా తప్పదు అంటున్న మైనింగ్ అధికారులు

మేఘా ఇంజనీరింగ్. ఈ పేరు చెపితే ఎక్కడ చూసినా కుంభకోణాల కథలే వినిపిస్తాయి. అది ఆంధ్ర ప్రదేశ్ అయినా..తెలంగాణ లో అయినా అదే కథ. ఆంధ్ర ప్రదేశ్ లో గత ప్రభుత్వం లో ఈ కంపెనీ చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్ట్ లో భారీ స్కాం జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించిన విషయం తెలిసిందే. స్వయంగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా అసెంబ్లీ సాక్షిగా ఇదే అంశంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కానీ అయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే కంపెనీకి ప్రత్యేక ప్రేమతో పోలవరం ప్రాజెక్ట్ కట్టబెట్టారు. ఇక్కడ కూడా ఎన్నో అదనపు వెసులుబాట్లు కల్పించినట్లు అధికారులు చెపుతున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే గత కొంత కాలంగా పదే పదే వినిపిస్తున్న కాళేశ్వరం స్కాం లో ప్రధాన లబ్ధిదారు మేఘా ఇంజనీరింగ్ కంపెనీ యే అని కాగ్ కూడా తన నివేదికలో తేల్చింది. ఇది అంతా ఒక రకమైన ఆర్థిక విధ్వంసం అయితే...కంపెనీ ఇప్పుడు దీనికి తోడు ప్రకృతి విధ్వంసానికి కూడా తెగబడింది. ఒక వైపు దక్కించుకున్న ప్రతి ప్రాజెక్ట్ లో భారీ ఎత్తున లబ్దిపొందుతూ కూడా చివరకు ఈ కంపెనీ ప్రకృతి వనరులు కూడా వదలకుండా దోచుకోవటం...అక్రమ మార్గంలో తవ్వకాలు చేపట్టి కోట్ల రూపాయల మేర లబ్ది పొందేందుకు ప్రయత్నం చేసింది.

ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నది తమకు అనుకూలమైన ప్రభుత్వమే కావటంతో ఎవరేమి చేస్తారు అనే ధీమా ఆ కంపెనీలో కనిపించింది అని...అందుకే ఇష్టానుసారం అక్రమ మైనింగ్ కు పాల్పడినట్లు అధికారులు చెపుతున్నారు. తీరా ఈ విషయం ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటి) వరకు వెళ్ళింది అని అధికారులు వెల్లడించారు. ఈ అక్రమ మైనింగ్ వ్యవహారం అంతా కూడా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గ్రామీణ మండలంలోని కొత్తూరు రిజర్వు ఫారెస్ట్ ఏరియా లో సాగింది. ఇక్కడ మేఘా ఇంజనీరింగ్ పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ చేసినట్లు గనుల శాఖ అధికారులు తమ నివేదికలో స్పష్టం చేశారు. ఏపీలో వివిధ పనులు చేస్తున్న మేఘా ఇంజనీరింగ్ తన ప్రాజెక్టులకు అవసరమైన గ్రావెల్ తో పాటు క్లే, బండరాళ్లు అక్రమంగా తరలించింది. వీటి సేకరణకు అయ్యే వ్యయం అంతా కూడా ప్రాజెక్ట్ కంపోనెంట్ లో ఉంటుంది...దీనికి ప్రభుత్వం బిల్స్ చెల్లిస్తుంది. అయినా కూడా మేఘా ఇంజనీరింగ్ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్ చేసి లబ్ది పొందాలని చూడటం విశేషం. అంతే కాదు

మేఘ ఇంజనీరింగ్ ఇటు పర్యావరణ అనుమతులు తీసుకోలేదు . అటు గ్రావెల్ తవ్వకాలకు గనుల శాఖ నుంచి పర్మిషన్లు తీసుకోకుండా సొంతంగా విజయవాడ రూరల్ మండలంలోని కొత్తూరు తాడేపల్లి వేమవరం గ్రామాల పరిధిలో ఉన్నటువంటి రిజర్వ్ ఫారెస్ట్ ను తవ్వేశారు అనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. సుమారు ముప్పై శాతం మేర తవ్వకాలు డైరెక్ట్ గా ఇదే కంపెనీ చేయగా... మిగతా డెబ్బై శాతం గ్రావెల్ రైతులతో పాటు ఇతర బినామీ పేర్లతో తవ్వినట్లు గనుల శాఖ వర్గాలు చెపుతున్నాయి. ఇటు విజయవాడ రూరల్ మండలం తో పాటు మరోవైపు జి కొండూరు మండలం వెలగలేరులో పోలవరం రైట్ కెనాల్ మీద కూడా పెద్ద ఎత్తున మెగా కంపెనీ గ్రావెల్ ను తవ్వేసి తీసుకెళ్లిపోయింది. దీని మీద ఫిర్యాదులు రాగా గనుల శాఖ విచారణ చేసింది. మొత్తంగా రెండు ప్రాంతాల్లో దగ్గర దగ్గర వంద కోట్ల రూపాయల విలువైన గ్రావెల్, బండరాళ్లు తవ్వి తీసినట్టుగా గనుల శాఖ నిర్ధారణ చేసింది.

ఈ విషయంలో మేఘా తో పాటు పలువురు పర్యావరణ ఉల్లంఘన తో పాటు గనుల శాఖకు సంబంధించిన నిబంధనలను కూడా ఉల్లగించినట్లు తేల్చారు. అదే సమయంలో అక్రమ మైనింగ్ కు సంబంధించి మేఘా తో పాటు ఉల్లంఘనలకు పాల్పడిన వారందరికీ జరిమానాలు విధించినా కూడా వాటిని కూడా కంపెనీ బేఖాతరు చేసింది. అక్రమ మైనింగ్ విషయంలో మేఘా కు గనుల శాఖ కోట్ల రూపాయల జరిమానా విధించింది. అయినా కంపెనీ లైట్ తీసుకుంది. మరి ఈ విషయంలో ఎన్ జీటి ఎలా స్పందిస్తోందో వేచి చూడాలి. మేఘా తో పాటు పలువురు కంపెనీ బినామీలు వేమవరం గ్రామంలో సర్వేనెంబర్ 147 148, 6,7,8 పరిధిలో అడ్డగోలు మైనింగ్ చేశారు. వెలగలేరు గ్రామం పరిధిలో సర్వేనెంబర్ 501, 504,508,509,511,512,520,521 గ్రావెల్ అక్రమంగా తవ్వి తీసుకెళ్లిపోయారు. అధికారికంగా వేసిన పెనాల్టీ లే కోట్ల రూపాయలు ఉంటే...లెక్కలోకి రాని అక్రమాలు ఇంకా చాలా ఎక్కువ ఉంటాయని గనుల శాఖ వర్గాలు చెపుతున్నాయి.

Next Story
Share it