Telugu Gateway
Andhra Pradesh

పవన్ కళ్యాణ్ పిలుపుకు టాలీవుడ్ హీరోలు స్పందిస్తారా?!

పవన్ కళ్యాణ్ పిలుపుకు  టాలీవుడ్ హీరోలు స్పందిస్తారా?!
X

మెగా స్టార్ చిరంజీవి తన సినిమా ఏదైనా విడుదల అవుతుంది అంటే జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తారు. తర్వాత మళ్ళీ మాములే. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే ఒకసారి తాను తటస్థం అని...మరో సారి తన మద్దదు సొంత తమ్ముడికి కాకుండా ఇతరులకు ఎలా ఉంటుంది అంటూ ప్రశ్నిస్తారు చిరంజీవి. ఇలా గందరగోళ ప్రకటనలు చేయటంలో చిరంజీవి ముందు వరసలో ఉంటారు. ఇది అంతా ఇప్పుడు ఎందుకు అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వారాహిలో ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటిస్తూ సినిమా హీరో లకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. తనకు చిరంజీవి, బాలకృష్ణ, రామ్ చరణ్, అల్లు అర్జున్ తో పాటు ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి హీరోలు అన్నా కూడా ఇష్టమే అన్నారు. ప్రభాస్, మహేష్ లు తన కంటే పెద్ద హీరోలు అని...వారి రెమ్యూనరేషన్ కూడా తన కంటే ఎక్కువ అంటూ వ్యాఖ్యానించారు. ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయితే ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఇప్పుడు గ్లోబల్ హీరోలు గా మారిపోయారని...తన కంటే వీళ్ళకే ఎక్కువ పాపులారిటీ ఉంది అంటూ కామెంట్స్ చేశారు . బుధవారం నాడు కోనసీమ జిల్లా ముమ్మిడివరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ తనకు ఏ మాత్రం ఇగో లేదు అన్నారు పవన్ కళ్యాణ్. తాను అందరు హీరోల సినిమాలు చూస్తానని...కనిపిస్తే మాట్లాడుకుంటాం అని తెలిపారు. సినిమాల పరంగా మీ హీరోల మీద ఇష్టాన్ని రాజకీయాల్లో చూపించకండి..

ఇక్కడ రైతుకు కులం లేదు..కుల పరంగా మనలో మనం గొడవ పడొద్దు అని విజ్ఞప్తి చేస్తున్నా..సినిమాల విషయంలో ఎవరినైనా అబిమానించండి కానీ..రాజకీయాల విషయంలో సమిష్టిగా ఆలోచిద్దాం అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పోరాటం చేసే వాళ్ళు సమాజానికి కావాలి అని...తాను ఒక్కడినే దీనికి సారిపోను అంటూ కామెంట్ చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా టాలీవుడ్ కు చెందినా టాప్ హీరోల పేర్లు ప్రస్తావించటం ఒక వ్యూహం ప్రకారమే చేస్తున్నట్లు కనిపిస్తోంది. తన ఫాన్స్ తో పాటు ఇతర హీరోల ఫాన్స్ ను కూడా తమ వైపు తిప్పుకోగలితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అనేది పవన్ కళ్యాణ్ ఆలోచన అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో తప్పు పెట్టాల్సింది ఏమి లేదు. కానీ ఇతర హీరో లు బహిరంగంగా బయటికి వచ్చి రాజకీయంగా పవన్ కళ్యాణ్ ప్రయత్నాలకు మద్దతు ఇస్తారో లేదో తెలియదు కానీ..అది జరగటానికి ముందే సొంత కుటుంబ సభ్యులు అయిన చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ లు ఈ మేరకు ప్రకటన చేస్తారా అన్నది ఇప్పుడు అత్యంత కీలకం కానుంది. ఎందుకంటే సొంత మనుషులే బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ కు మద్దదు ఇవ్వకపోతే ఇతర హీరో లు అసలు ఈ విషయం ఏ మాత్రం పట్టించుకోరు అనే విషయం తెలిసిందే. దీంతో పవన్ కళ్యాణ్ తాజాగా హీరో ల గురించి పదే పదే చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో మెగా హీరో ల స్పందన అత్యంత కీలకం కానుంది.

Next Story
Share it