మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్..సర్కారుకు చుక్కెదురు
మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో ఏపీ సర్కారుకు చుక్కెదురు అయింది. సింగిల్ బెంచ్ తీర్పుపై సర్కారు డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేయగా..అక్కడా ఎదురుదెబ్బ తగిలింది. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా అశోక్‌గజపతిరాజు కొనసాగింపునకు హైకోర్టు గ్రీన్ సిగ్నలిచ్చింది. ఈ అంశంలో మధ్యంతర ఆదేశాలకు నో చెబుతూ తదుపరి విచారణను వాయిదా వేసింది. కొద్ది రోజుల క్రితం అశోక్‌గజపతిరాజును పునర్ నియమిస్తూ ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం, సంచయిత గజపతిరాజు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. సీజే ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్‌లో పిటిషన్లపై విచారణ జరిగింది. ప్రభుత్వం, సంచయిత వేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది.
వైసీపీ అధికారంలోకి వచ్చాక అశోక్ గజపతిరాజును ఈ పదవుల నుంచి తప్పించి ఆయన అన్న, మాజీ మంత్రి పూసపాటి ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయిత గజపతిరాజును నియమిస్తూ అర్ధరాత్రి ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వం జీవోపై అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం చైర్‌పర్సన్‌గా సంచయిత గజపతి నియామక జీవోను హైకోర్టు సింగిల్ బెంచ్ కొట్టివేసింది. అశోకగజపతిరాజును పునర్నియమించాలంటూ ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ క్రమంలో ప్రభుత్వం మళ్లీ హైకోర్టును ఆశ్రయించగా..న్యాయస్థానం అశోక్ గజపతిరాజుకు అనుకూలంగా తీర్పువెలువరించింది.