సీఎం జగన్ కు రాజమౌళి, మహేష్ బాబు థ్యాంక్స్
ప్రతిష్టాత్మక సినిమాల విడుదలకు ముందు ఏపీ సర్కారు టిక్కెట్ ధరల పెంపు నిర్ణయం తీసుకోవటంతో పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై ప్రముఖ దర్శకుడు రాజమౌళి, హీరో మహేష్ బాబులు స్పందించారు. వీరిద్దరూ ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. కొత్త జీవో, సవరించిన టిక్కెట్ రేట్ల ద్వారా తమ సమస్యలను విని పరిష్కరించినందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు'..అని మహేష్ బాబు తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం మధ్య పరస్పర బలమైన, ఆరోగ్యకరమైన సహకారం కోసం మేము ఎదురు చూస్తున్నాము' అని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
తాజాగా రాజమౌళి స్పందించారు. 'కొత్త జీవోతో టికెట్ల ధరలు సవరించి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సహాయం చేసినందుకు ఏపీ సీం జగన్ కి, మంత్రి పేర్ని నానికి ధన్యవాదాలు. ఇది సినిమాల పునరుద్ధరణకు ఎంతో సహాయపడుతుందని ఆశిస్తున్నాను.' అంటూ పేర్కొన్నారు. తెలంగాణ ముఖమంత్రి చంద్రశేఖర్ రావుకు కూడా కృతజ్ఞతలు తెలిపారు రాజమౌళి. 'పెద్ద సినిమాలకు రోజుకు 5 షోలను అనుమతించినందుకు సీఎం కేసీఆర్ కి, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మాకు నిరంతరం మద్దతు ఇచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కి ధన్యవాదాలు.' అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు.