ఈ మహానాడు చూసి జగన్ కు నిద్రరాదు
ఏపీ సర్కారుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మహానాడు వేదికగా ఆయన ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. మహానాడుతో వైసీపీపై యుద్ధం ప్రారంభం అయిందని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఒంగోలులో జరిగిన మహానాడు లో మాట్లాడుతూ మహానాడు సభ చూసిన తర్వాత జగన్ కు పిచ్చెక్కుతుంది..నిద్రరాదన్నారు. వైసీపీ మీటింగ్ లు వెలవెల పోతుంటే ..మన మీటింగ్ లు కళకళలడుతున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మద్యం డబ్బు..మైనింగ్ డబ్బు అంతా జగన్ జేబులోకి వెళుతుందని ఆరోపించారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని పార్టీపరంగా ఎన్టీఆర్ ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు వీలుగా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి జిల్లాలో మినీ మహానాడు పెడతామని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాలు..చేసిన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
సినిమా వాళ్లను కూడా గుప్పిట్లో పెట్టుకోవాలని జగన్ చూశారని మండిపడ్డారు. అఖండ సినిమా ఆపాలని చూస్తే .ఏమైంది..ప్రజలను నమ్ముకుని విడుదల చేశారు..విజయం సాధించారు అన్నారు. సినిమాలకు నువ్వు పర్మిషన్లు ఇస్తావా.. రేపు నీ టీవీ..పేపర్ ..భారతీ సిమెంట్ ఎలా నడుపుతావో చూస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో..నేను చూస్తా..ఎంత ఇబ్బంది పెడితే అంత రాటుదేలిపోతా అంటూ వ్యాఖ్యానించారు. క్విట్ జగన్..సేవ్ ఏపీ ఇదే మన నినాదం కావాలన్నారు రేపు ఓడిపోయాక మీరు ఇదే రోడ్లపై తిరగాలి..ఇక్కడే ఉండాలి గుర్తుపెట్టుకోవాలి అని హెచ్చరించారు. జగన్ కు బస్సులు ఉంటే..మాకు ప్రజలు ఉన్నారన్నారు. ఈ మూడు సంవత్సరాల్లో జగన్ 1.75 లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేశారన్నారు. విభజన కంటే..కరోనా కంటే ఎక్కువ అన్యాయం జరిగింది జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల అని ఆరోపించారు. అప్పు చేసిన ఎనిమిది లక్షల కోట్లు ఎక్కడికి పోయావన్నారు.
వైసీపీకి కొత్త అర్ధం చెప్పిన లోకేష్
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మహానాడులో మాట్లాడుతూ వైసీపీకి కొత్త నిర్వచనం ఇచ్చారు. వైఎస్ఆర్ సీపీ అంటే యువజన శృంగార రౌడీ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్ సీపీ) అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబుది ముందు చూపు...జగన్ ది మందు చూపు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాముడు అయితే..జగన్ రాక్షసుడు అంటూ మండిపడ్డారు. అణఛివేత అధికమైతే...తిరుగుబాటు మొదలవుతుందని, అది ఇప్పుడు ఒంగోలు నుంచి ప్రారంభం అయిందని తెలిపారు. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు మాట్లాడుతూ గత ఎన్నికల్లో చంద్రబాబును ఓడించి ప్రజలు తప్పు చేశారన్నారు. కారణాలు ఏమైనా వచ్చే ఎన్నికల్లో మాత్రం టీడీపీకి 160 సీట్లకుపైనే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్న వాళ్ళకు అధికారం అప్పగిస్తారా అని ప్రశ్నించారు.