రాష్ట్రం పరువు తీస్తున్న జగన్

మహానాడు వేదికగా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు వైసీపీ సర్కారుపై నిప్పులు చెరిగారు. నేరస్తులకు అధికారం అప్పగిస్తే ఎలా ఉంటుందో సీఎం జగన్ ఏపీ ప్రజలకు చూపించారన్నారు. జగన్ పాలనతో దేశంలో రాష్ట్రం పరువు పోతుందని అన్నారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామన్న జగన్ ఇప్పుడు కేంద్రానికి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారంటూ విమర్శలు గుప్పించారు. మహానాడు తెలుగుజాతికి పండుగ అని వ్యాఖ్యానించారు. చరిత్ర ఉన్నంత వరకూ టీడీపీ ఉంటుందన్నారు. పసుపు రంగు చూస్తే చైతన్యం వస్తుందన్నారు. రాజకీయం అంటే తమాషా కాదన్నారు. రాష్ట్రంలో ఉన్మాది పాలన కొనసాగుతోందన్నారు. 'టీడీపీ కార్యకర్తలను ఎంతగా ఇబ్బంది పెడితే.. అంతగా రెచ్చిపోతారు. రాష్ట్ర భవిష్యత్ కోసం పోరాడుతాం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బాదుడే బాదుడు. వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. ఎవరు తప్పు చేసినా వదిలేది లేదు. ప్రజా సమస్యలపైనే మన పోరాటం. రాష్ట్రంలో ఏ రైతు ఆనందంగా లేరు. దిక్కుతోచని పరిస్థితుల్లోనే రైతుల ఆత్మహత్యలు. రైతు సమస్యల పరిష్కారం పోరాటం చేస్తాం.
రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు. రోడ్డు మీదకు రండి... మీకు అండగా మేము ఉంటాం. రాష్ట్రంలోని ప్రజా సమస్యలపైనే మన పోరాటం. పెట్రోల్ ధరలు కేంద్రం తగ్గించినా వైసీపీ ప్రభుత్వం తగ్గించడం లేదు. ఇంటిపన్ను, చెత్తపన్ను, డ్రైనేజీ ట్యాక్స్ అన్నీ పెంచేశారు. రాష్ట్రంలో ఏ రైతు అయినా ఆనందంగా ఉన్నాడా? అమ్మ ఒడి అన్నారు.. నాన్న బుడ్డీ పెట్టారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు.. మోటార్లకు మీటర్లు పెట్టి రైతు మెడకు ఉరేసే పరిస్థితి తీసుకోస్తారా? రాష్ట్రంలో నిత్యావసరాలు కొనే పరిస్థితి లేదు. రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను తీసేశారు. విదేశీ విద్య, పెళ్లి కానుక పథకాలన్నీ ఏం చేశారు?'' అని తెలిపారు.వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే కేటాయిస్తామని పేర్కొన్నారు. పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ కోసం పనిచేసే వాళ్లకే అవకాశాలు వస్తాయన్నారు.
వైసీపీ అవినీతి వల్లే రాష్ట్రం దివాళా తీసిందన్నారు. రాష్ట్రంలో ''సంక్షేమం లేదు.. అంతా మోసకారి సంక్షేమమే. వైసీసీ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదు. నిన్న ఐఎస్ బీలో ప్రధాని నా పేరును ప్రస్తావించకపోవచ్చు. కానీ నా కృషి వల్లే ఐఎస్ బీ. హైదరాబాద్‌కు వచ్చింది. 2 లక్షల కోట్ల రూపాయల సంపదను నాశనం చేశారు. పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. మద్యం, గంజాయి, డ్రగ్స్‌తో రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్‌గా మార్చారు. చేతకాకపోతే వైసీపీ ప్రభుత్వం గద్దె దిగిపోవాలన్నారు. గత నలభై సంవత్సరాల్లో ఎదుర్కొన్న ఇబ్బందులు ఒకెత్తు అయితే ఈ మూడేళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందుల మరొక ఎత్తు అని వ్యాఖ్యానించారు. వైసీపీ పోలీసులను అడ్డుపెట్టుకుని పాలన చేస్తోందని మండిపడ్డారు. కల్తీ మద్యం, గంజాయిలతో రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్ గా మార్చారని విమర్శించారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ఆ ఛాన్స్ తోనే రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్సీ చేసిన డ్రైవర్ హత్య నుంచి దారిమళ్లించేందుకు కోనసీమలో కొత్త చిచ్చుకు తెరలేపారని ఆరోపించారు.