Telugu Gateway
Andhra Pradesh

అధికార పార్టీ కి మరో ఎంపీ రాజీనామా

అధికార పార్టీ కి మరో ఎంపీ రాజీనామా
X

ఎన్నికల ముందు అధికార వైసీపీ కి చెందిన ఎంపీలు వరసగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే అధికార పార్టీని మచిలీపట్నం ఎంపీ బాల శౌరి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవ రాయలు, కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్, రాజ్య సభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీడారు. తాజాగా అంటే బుధవారం నాడు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కూడా వైసీపీ కి గుడ్ బై చెప్పారు. రాజీనామా ప్రకటన సందర్బంగా మాగుంట కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు అహం లేదు అని..ఉన్నది ఆత్మాభిమానమే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. గౌరవాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో తన కొడుకు మాగుంట రాఘవ రెడ్డి ని ఎన్నికల బరిలో నిలపాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల వైసీపీని వీడుతున్నామన్నారు.

తనకు జగన్మోహన్ రెడ్డి సహాయసహకారాలు అందించారని.. ఈ సందర్బంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిజేస్తున్నానని మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసుల రెడ్డి సీటు ఇవ్వకూడదు అని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయన సీటు కోసం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అవి ఫలించలేదు. దీంతో ఇక మాగుంట వైసీపీ కి రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఆయన టీడీపీ లో చేరతారా...లేక బీజేపీ వైపు మొగ్గుచూపుతారా అన్నది తేలాల్సి ఉంది. రాబోయే రోజుల్లో తేలనున్న పొత్తుల ఆధారంగా ఈ నిర్ణయం ఉండే అవకాశం ఉంది అని చెపుతున్నారు.

Next Story
Share it