ఐదు టవర్ల కు 3673 కోట్లు

ఎట్టకేలకు అమరావతి ఐకానిక్ టవర్ల టెండర్ల కేటాయింపు పూర్తి అయింది. వాస్తవానికి ఎప్పుడో మే లో పూర్తి కావాల్సిన ఈ పని జూన్ నెలాఖరు వరకు వచ్చింది. ఇంత జాప్యం జరగటానికి ఎన్నో కారణాలు ఉన్నాయని అధికార వర్గాలు చెపుతున్నాయి. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పేరుతో నిర్మించనున్న సెక్రటేరియట్, హెచ్ఓడీ కాంప్లెక్స్ ల టెండర్లను పన్నులు కాకుండా మొత్తం 3673 .43 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కేటాయించారు. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ఈ టెండర్లు దక్కించుకున్నది అన్ని కీలక సంస్థలే . ఇందులో లార్సన్ అండ్ టూబ్రో ( ఎల్ అండ్ టి), ఎన్ సిసి, షాపూర్జీ పల్లోంజీ లు ఉన్నాయి. ఈ మూడు కంపెనీలు వెరైటీ గా ఈ టెండర్లు దక్కించుకోవటం కోసం వేసిన ఎక్సెస్ చూస్తే ఎవరికైనా అనుమానం రాక మానదు. ఎల్ అండ్ టి కంపెనీ సచివాలయంలోని 3 , 4 టవర్ల టెండర్ దక్కించుకుంది. ఈ పనుల కోసం కంపెనీ దాఖలు చేసిన ఎక్సెస్ 4 . 54 శాతం. 1247. 22 కోట్ల రుపాయల అంచనా వ్యయంతో టెండర్లు పిలవగా ఎక్సెస్ తో కలుపులు ఈ మొత్తం 1303 . 85 కోట్ల రూపాయలు అయింది.
మరో కంపెనీ షాపూర్జీ పల్లోంజీ సచివాలయంలోని టవర్ 1 , 2 ల నిర్మాణ కాంట్రాక్టు దక్కించుకుంది. ఈ సంస్థ కూడా వెరైటీ గా అంచనావిలువ కంటే 4 .50 శాతం ఎక్సెస్ కు బిడ్ వేసింది. దీంతో ఈ టవర్ల వ్యయం 1423 కోట్ల రూపాయల నుంచి 1487 . 11 కోట్ల రూపాయలకు చేరింది. జీఏడీ టవర్ అంటే ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే భవన నిర్మాణ కాంట్రాక్టు ఎన్ సిసి దక్కించుకుంది. ఈ కంపెనీ కూడా అంచనా వ్యయం కంటే 4 . 53 శాతం ఎక్సెస్ కోట్ చేసింది. దీంతో ఈ టవర్ నిర్మాణ వ్యయం 844 . 22 కోట్ల రూపాయల నుంచి 882 . 47 కోట్ల రుపాయలకు పెరిగింది. ఈ మూడు కంపెనీ వేసిన మొత్తం ఎక్సెస్ 158 కోట్ల రూపాయలు. అంటే ఈ మేర ప్రభుత్వ ఖజానాపై అదనం భారం పడినట్లే. మరో వైపు ఈ ఐకానిక్ టవర్ల టెండర్ల అంచనాల్లోనే భారీ ఎత్తున గోల్ మాల్ జరిగింది అనే ఆరోపణలు ఉన్నాయి. టెండర్లు దక్కించుకున్న కంపెనీలకు లెటర్ అఫ్ అవార్డు (ఎల్ఓఏ) ఇవ్వటానికి వీలుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ మరో విచిత్రం ఏమిటి అంటే గతంలో చంద్రబాబు కు ముడుపులు ఇచ్చినట్లు చెప్పిన షాపూర్జీ పల్లోంజీ కంపెనీ కూడా ఇప్పుడు అమరావతి లో కీలక ప్రాజెక్ట్ దక్కించుకోవటం. ఇతర కంపెనీ లతో పోలిస్తే ఈ కంపెనీ ఎక్సెస్ ఎక్కువ గా ఉంది.