Telugu Gateway
Andhra Pradesh

జ‌గ‌న్ చేస్తే త‌ప్పులేదు కానీ..లోకేష్ చేస్తే త‌ప్పా?!

జ‌గ‌న్ చేస్తే త‌ప్పులేదు కానీ..లోకేష్ చేస్తే త‌ప్పా?!
X

టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ గురువారం నాడు ప‌ద‌వ త‌ర‌గ‌తి ఫెయిలైన విద్యార్ధుల‌తో జూమ్ లో స‌మావేశం అయితే విద్యార్ధుల‌తో రాజ‌కీయం చేయ‌టం అంట‌. దీనిపై అధికార వైసీపీ నేత‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. అంతే కాదు..ఎన్న‌డూలేని రీతిలో లోకేష్ నిర్వ‌హించిన జూమ్ మీటింగ్ లో స‌డెన్ ఎంట్రీ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని..వ‌ల్ల‌భ‌నేని వంశీలు ఒకింత షాకిచ్చార‌నే చెప్పాలి. ఊహించ‌ని ప‌రిణామంతో స‌మావేశం ఆగిపోయింది. ఆ త‌ర్వాత రాజ‌కీయ విమ‌ర్శ‌ల సంగ‌తి స‌రేస‌రి. అయితే ఖ‌చ్చితంగా వైసీపీ నేత‌లు చేసింది త‌ప్పు అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎవ‌రి స‌మావేశాలు వారు పెట్టుకుని..ఎవ‌రి వాద‌న‌లు వారు విన్పించుకోవ‌చ్చు. ఎవ‌రి వాద‌న‌ల‌కు ప్ర‌జ‌లు క‌నెక్ట్ అవుతారో వారికే ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ల‌భిస్తుంది. అంతే కానీ..ఒక‌రి మీటింగ్ ల్లోకి మ‌రొక‌రి చొర‌బ‌డి రాజకీయం చేయ‌టం త‌గ‌దు. విద్యార్ధుల‌తో రాజకీయాలా అని వైసీపీ నేత‌లు ఇప్పుడు రాగాలు తీస్తున్నారు కానీ...వైసీపీ అధినేత‌, ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఇదే ప‌ని చేశారు.

కాలేజీ విద్యార్ధుల‌తో స‌మావేశం అయి ప్ర‌త్యేక హోదాపై ఉప‌న్యాసాల మీద ఉప‌న్యాసాలు ఇచ్చారు. ఈ సంగ‌తి వైసీపీ నేత‌లు మ‌ర్చిపోయిన‌ట్లు ఉన్నారు. అంతే కాదు ఈ స‌మావేశాల్లో విద్యార్ధుల‌తో పొగ‌డ్త‌ల మీద పొగ‌డ్త‌లు కురిపించుకున్నారు. పాత వీడియోలు తిర‌గేస్తే విద్యార్ధుల‌తో జ‌గ‌న్ ఏమి మాట్లాడారు.. విద్యార్ధులు జ‌గ‌న్ తో ఎలా మాట్లాడారు అన్న‌ది తేలిపోతుంది. జ‌గ‌న్ సీఎం అయ్యారు..అంతే ప్రత్యేక హోదా లేదు..అప్పుడు విద్యార్ధుల‌తో చెప్పిన మాట‌లు..ఇచ్చిన హామీలు అన్నీ అట‌కెక్కాయి అని చెప్పొచ్చు. అధికారంలో ఉన్న‌ప్పుడు ప్ర‌తిప‌క్ష పార్టీలు ఏవీ కూడా విద్యార్ధుల స‌మ‌స్య‌ల‌పై మాట్లాడ‌కూడ‌దు..కానీ వైసీపీ మాత్రం ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు మాత్రం తాను విద్యార్ధుల‌తో ఎన్ని స‌మావేశాలు అయినా పెట్టుకోవ‌చ్చు. ఇది ద్వంద నీతికాదా?. లోకేష్ ముందే సిద్ధం చేసుకున్న స్క్రిప్ట్ ప్ర‌కారం మాట్లాడార‌ని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. సీఎం జ‌గ‌న్ బ‌హిరంగ స‌భ‌ల్లో కూడా చూసి చ‌దువుతున్న విష‌యాన్ని వైసీపీ నేత‌లు మ‌ర్చిపోయారు.

Next Story
Share it