Telugu Gateway
Andhra Pradesh

స్పెషల్ ఫ్లైట్స్ లో విహారం...అధికారిక వాహనాల్లో పర్యటనలు!

స్పెషల్ ఫ్లైట్స్ లో విహారం...అధికారిక వాహనాల్లో పర్యటనలు!
X

ఆంధ్ర ప్రదేశ్ లిక్కర్ స్కాంతో లింక్ అయి ఉన్న ఇంకెన్ని డెన్ లు భయటపడతాయో?. ఇదే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ..అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం. ఇటీవల సిట్ అధికారులు హైదరాబాద్ సమీపంలోని ఫార్మ్ హౌస్ లో పదకొండు కోట్ల రూపాయల నోట్ల కట్టలతో కూడిన బాక్స్ లు స్వాధీనం చేసుకోగా...తాజాగా ఈ స్కాం లో ఏ 34 గా ఉన్న సిహెచ్ వెంకటేష్ నాయుడు వీడియో ఒకటి బయటకు వచ్చింది. సిట్ అధికారులు ఈ కేసు లో నిందితుల ఫోన్ల నుంచి పాత డేటా మొత్తాన్ని వెలికి తీయగా ఇప్పుడు రకరకాల సమాచారం వెలుగులోకి వస్తోంది. కొత్తగా సిహెచ్ వెంకటేష్ నాయుడు పెద్ద ఎత్తున ఐదు వందల రూపాయల నోట్ల కట్టలు ఉన్న ప్రాంతంలో వాటిని లెక్కిస్తూ కనిపించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియో లో డబ్బు చూస్తే ఆ మొత్తం కోట్ల రూపాయల్లో ఉంటుంది అనే విషయం స్పష్టంగా చెప్పొచ్చు. ఈ వెంకటేష్ నాయుడు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కి ఎంతో సన్నిహితుడు.

అసలు ఈ కేసు తో తమకు ఏ మాత్రం సంబంధం లేదు అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాదిస్తున్నా కూడా లిక్కర్ స్కాం కు సంబంధించిన నగదు బదిలీ వ్యవహారంలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు సిట్ అధికారులు చెపుతున్నారు. ఈ వెంకటేష్ నాయుడు స్పెషల్ ఫ్లైట్స్ లో తిరిగిన వీడియోలతో పాటు ఆయన స్పెషల్ ఫ్లైట్ నుంచి దిగిన తర్వాత కేవలం ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులు మాత్రమే వాడాల్సిన రెడ్ లైట్ ఉన్న కారు లో వెంకటేష్ దర్జాగా ఎక్కుతున్న వీడియో లు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. వీటితో పాటు కొంత మంది హీరోయిన్లతో స్పెషల్ ఫ్లైట్ లో దిగిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక్కడ మరో విచిత్రం ఏమిటి అంటే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన గతంలో హిందూ పత్రిక లో ఒక ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చారు. ఇక్కడ మరో కీలక విషయం కూడా ప్రస్తావించాలి.

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కి చెందిన కంపెనీలు కూడా బిఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఇలాగే కెసిఆర్, కెటిఆర్ పుట్టిన రోజులకు తెలంగాణా ఎడిషన్స్ లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ అధికారంలో ఉన్నప్పుడు...తెలంగాణాలో బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇది సాగింది. ఏపీ లిక్కర్ స్కాం లో సిట్ ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసే నాటికీ ఇంకెన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. అయితే వైసీపీ నేతలు మాత్రం ఫార్మ్ హౌస్ లో పట్టుపడ్డ పట్టుపడిన 11 కోట్ల రూపాయలతో పాటు తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో విషయాలను తోసిపుచ్చుతూ ఇది అంతా కూటమి ప్రభుత్వ కుట్రగా ఆరోపిస్తున్నారు. మరి సిట్ ఎంత పక్కాగా ఆధారాలతో ఈ కేసు ను నిరూపిస్తుందో చూడాలి.

Next Story
Share it