Telugu Gateway
Andhra Pradesh

ముడుపుల నిధులు ఎంపీ కంపెనీల్లోకి!

ముడుపుల నిధులు ఎంపీ కంపెనీల్లోకి!
X

ఆంధ్ర ప్రదేశ్ లిక్కర్ స్కాం లో కీలక పరిణామం. ఈ కేసు లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ని సిట్ అరెస్ట్ చేసింది. లిక్కర్ స్కాం లో ఆయన ఏ 4 గా ఉన్నారు. తనకు అరెస్ట్ నుంచి ఉపశమనం కలిపించాల్సిందిగా మిథున్ రెడ్డి సుప్రీం కోర్టు ను ఆశ్రయించినా కూడా ఆయన కు ఊరట లభించలేదు. ఆయన బెయిల్ పిటిషన్ ను సుప్రీం కోర్టు శుక్రవారం నాడు తిరస్కరించింది. దీంతో ఆయన శనివారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి విజయవాడ చేరుకొని సిట్ విచారణ కు హాజరు అయ్యారు. ఉదయం నుంచి సిట్ అధికారులు ఈ కేసు విషయంలో మిథున్ రెడ్డి ని విచారించారు. తర్వాత అంటే శనివారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీ హయాంలో సాగిన మద్యం స్కాం లో 3500 కోట్ల రూపాయల మేర ముడుపులు చేతులు మారినట్లు సిట్ గుర్తించింది. ఈ స్కాం లో భాగంగా కొంత మేర ముడుపుల సొమ్ము మిథున్ రెడ్డి కంపెనీలకు కూడా వెళ్లాయి అని సిట్ ఆరోపిస్తోంది. ఇప్పటికే సిట్ ఈ కేసు కు సంబంధించి ప్రాథమిక ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మరో 20 రోజుల్లో సమగ్ర చార్జిషీట్ వేస్తామని కోర్టు కు తెలిపింది.

ఇప్పుడు అరెస్ట్ చేసిన మిథున్ రెడ్డి నుంచి మరిన్ని వివరాలు సేకరించటంతో పాటు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ని కూడా మరో సారి విచారణకు హాజరు కావాలని కోరిన విషయం తెలిసిందే. ఆయన తనకు కొంత సమయం కావాలని కోరుతూ సిట్ కు లేఖ రాశారు. ఇప్పటికే సిట్ ఈ లిక్కర్ స్కాం కు సంబంధించి కీలక ఆధారాలు సేకరించినట్లు చెపుతున్నారు. అయితే లిక్కర్ స్కాం ప్రకంపనలు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ వరకే ఆగి పోతాయా లేక ఇంకా ముందుకు కూడా వెళ్తాయా అన్న విషయం రాబోయే రోజుల్లో కానీ తేలదు. కొద్ది రోజుల క్రితం మీడియా తో మాట్లాడిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అసలు లిక్కర్ స్కాం కు ఎంపీ మిథున్ రెడ్డి కి ఏమి సంబంధం అని ప్రశ్నించారు . అసలు తన హయాంలో లిక్కర్ స్కామే లేదు అని ఆయన చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సిట్ మాత్రం ఈ స్కాం సొమ్ములు ఏకంగా మిథున్ రెడ్డి కంపెనీల్లోకి వెళ్లినట్లు చెపుతోంది. సిట్ తన విచారణలో ఈ ముడుపులు సొమ్ము లావాదేవీల వివరాలు ముందు పెట్టి మిథున్ రెడ్డి ని ప్రశ్నించింది.

Next Story
Share it