ఆరు వేల కోట్ల పనులు ఆయనే పంచుతున్నారా?!
ఆ మంత్రి అన్ని పనులు అవుట్ సోర్సింగ్ కు ఇచ్చి ఎంజాయ్ చేస్తున్నారా?!
ఏపీ అధికార వర్గాల్లో కలకలం రేపుతున్న వ్యవహారం
పిన్నమనేని పాలీ క్లినిక్ ఏరియా లోని ప్రైవేట్ ఆఫీస్ ల్లో దందా!
కొంత మంది అధికారులు కూడా ఇక్కడకు క్యూ !
అయన మంత్రి కాదు. అధికారికంగా ఏ పార్టీ లీడర్ కాదు. కానీ ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలో ఉన్న రెండు పార్టీ లకు మాత్రం బాగా కావాల్సిన వాడు. ఆయనే లింగా..ది రింగ్ లీడర్. ఒక కీలక శాఖకు సంబంధించిన ఆరు వేల కోట్ల రూపాయల టెండర్లను ఎవరికి ఇవ్వాలి...ఎలా ఇవ్వాలి అనేది ఆయనే డిసైడ్ చేస్తున్నారు. ఇందుకు ముందుగానే ఆయా సంస్థల నుంచి కోట్ల రూపాయల మేర వసూళ్లు చేస్తున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సహజంగా వేల కోట్ల రూపాయల ప్రభుత్వ పనులు అంటే టెండర్ల ద్వారానే కేటాయించాలి. కానీ పేరుకే టెండర్లు ...దీని కంటే ముందే ఏ పని ఏ కాంట్రాక్ సంస్థకు ఇవ్వాలి అనేది నిర్ణయం అయిపోతుంది. ఈ ఆరు వేల కోట్ల రూపాయల పనుల్లో ఒక పని కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఏపీ ప్రభుత్వంలో అత్యంత పవర్ ఫుల్ మినిస్టర్ గా పేరున్న ఆయన దగ్గరకు వెళితే ఈ వ్యవహారాలు అన్నీ లింగా నే చూసుకుంటున్నాడు ...ఏదైనా ఉంటే ఆయనతో మాట్లాడుకోండి అని చెప్పటవం తో ఆ మంత్రి దగ్గరకు వెళ్లిన ఆ కీలక సంస్థ ప్రతినిధులు అవాక్కు అయ్యారు.
ఇక చేసేది ఏమీ లేక వెనక్కు తిరిగి వెళ్లిపోయారు. ఈ ఒక్క టెండర్ల ద్వారానే మొత్తం ఆరు వందల కోట్ల రూపాయల వసూళ్లకు స్కెచ్ వేశారు అని అధికార వర్గాలు చెపుతున్నాయి. ఆయన విజయవాడ లోని పిన్నమనేని పాలీ క్లినిక్ ప్రాంతంలో పలు ప్రైవేట్ ఆఫీస్ లు ఓపెన్ చేసి అక్కడ నుంచే అన్ని అక్రమ దందాలు సాగిస్తున్నట్లు చెపుతున్నారు. ఆయన ఆ కీలక మంత్రి శాఖకు సంబంధించిన టెండర్ల విషయం వరకే ఆగలేదు..రెండు కీలక జిల్లాలకు చెందిన వ్యవహారాల్లో కూడా ఫుల్ గా ఇన్వాల్వ్ అవుతూ జిల్లాకు చెందిన ఉన్నతాధికారులకు కూడా ఆయన ఆదేశాలు జారీ చేసే స్థాయికి వెళ్లిపోయారు అని చెపుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో కూడా రచ్చ రచ్చగా మారింది.
ప్రభుత్వ టెండర్ల తో పాటు జిల్లా ల వ్యవహారాల్లో ఆయన జోక్యం ఏంటో అర్ధం కావటం లేదు అని ఆ పార్టీ నేతలు ఈ లింగా పై గుర్రుగా ఉన్నారు. అయితే అతగాడు మాత్రం ఈ నాలుగేళ్లు తనను ఎవరూ ఏమి చేయలేరు అని...ఈ సమయంలో తన టార్గెట్ మొత్తం పూర్తి చేసుకుని తన దారి చూసుకుంటాను అని ఆయన తన సన్నిహితుల వద్ద చెపుతున్నారు. ప్రభుత్వంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉండటం సాధారణమే కానీ..ఏకంగా కొంత మంది మంత్రులు తమ శాఖలనే పవర్ బ్రోకర్లకు అవుట్ సోర్సింగ్ ఇవ్వటం ఇదే మొదటి సారి అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఈ టెండర్లకు దేశంలోనే దిగ్గజ నిర్మాణ సంస్థ అన్ని ప్యాకేజీ లకు బిడ్స్ వేయగా..ఆ సంస్థతో మాట్లాడి ఒక ప్యాకేజీ మాత్రమే బిడ్ వేయండి అది మీకే ఇస్తాం అని చెప్పి బేరాలు నడిపినట్లు కూడా ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. అందుకే ఎప్పుడో ఖరారు కావాల్సిన ఈ పనులు వాయిదా పడ్డాయి అని చెపుతున్నారు.