Telugu Gateway
Andhra Pradesh

నెక్స్ట్ ఛాన్స్ ఆయనకే అంటూ పార్టీ లో చర్చ!

నెక్స్ట్ ఛాన్స్ ఆయనకే అంటూ పార్టీ లో చర్చ!
X

లింగమనేని రమేష్. ఆయనకు జనసేన సభ్యత్వం ఉందో లేదో తెలియదు కానీ ఆ పార్టీలో...ప్రభుత్వ వ్యవహారాల్లో అంటే జనసేన కు చెందిన మంత్రుల శాఖల వ్యవహారాల్లో కూడా ఆయన కీలకంగా మారారు అనే చర్చ జనసేన వర్గాల్లో సాగుతోంది. తెర ముందు...తెర వెనక ఆయన అందిస్తున్న సేవలకు ప్రతిఫలంగా వచ్చే ఏడాది ఖాళీ కానున్న రాజ్య సభ సీట్లలో ఆయన కు రాజ్య సభ బెర్త్ దక్కటం ఖాయం అని జనసేన వర్గాలు చెపుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆయన అత్యంత సన్నిహితంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలుత జనసేన నుంచి రాజ్య సభకు ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కు అవకాశం దక్కుతుంది అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

కానీ టీడీపీ, బీజేపీ సర్దుబాట్లలో అది సాధ్యం కాకపోవటంతో నాగబాబును ఎమ్మెల్సీ చేసి ఏకంగా రాష్ట్ర క్యాబినెట్ లోకి కూడా తీసుకుంటామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ లెటర్ హెడ్ మీద ప్రకటించాల్సి వచ్చింది. అయినా అది ఎందుకో ఇంకా కార్యరూపం దాల్చలేదు. నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడు అయిన సానా సతీష్ కు రాజ్య సభ సీటు ఇవ్వటం కోసం జనసేన ను రేస్ నుంచి తప్పించాల్సి వచ్చింది అని టీడీపీ వర్గాలు గతంలో వెల్లడించాయి. వచ్చే ఏడాది జూన్ నాటికి ఆంధ్ర ప్రదేశ్ లో నాలుగు సీట్లు ఖాళీ కానున్నాయి. గతంలో వైసీపీ నుంచి రాజ్య సభకు ఎన్నికైన పరిమళ్ నత్వాని తో పాటు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, సానా సతీష్ ల సీట్లు ఖాళీ కానున్నాయి. ఈ నాలుగు సీట్లు కూడా కూటమి ఖాతాలోకే చేరనున్నాయి.

ఇందులో ఖచ్చితంగా ఒకటి జనసేన కు దక్కుతుంది అని..అది లింగమనేని రమేష్ కు కేటాయిస్తారు అని ఆ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. అదే సమయంలో లోకేష్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న సానా సతీష్ కు మరో సారి రెన్యూవల్ పక్కా అన్నది టీడీపీ వర్గాల మాట. వైసీపీ కి రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ సీటు నే సానా సతీష్ కు కేటాయించిన సంగతి తెలిసిందే. ఆయనకు ఫుల్ టర్మ్ ఛాన్స్ దక్కలేదు కాబట్టి రెండవసారి అవకాశం ఉంటుంది అని టీడీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకటి జనసేన కు పోతే, రెండవది సానా సతీష్ కు వెళ్ళటం ఖాయం అని...మిగిలిన రెండు సీట్లు ఎవరికీ అన్నది అప్పటి లెక్కల ప్రకారం కానీ తేలదు. ఇందులో కూడా బీజేపీ మరొకటి అడుగుతుందా లేదా అన్నది వేచిచూడాల్సింది. వైసీపీ సభ్యుల రాజీనామాలతో వచ్చిన ఆర్ కృష్ణయ్య సీటు ను, విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన సీటు ను బీజేపీ కి చెందిన పాకా వెంకట సత్యనారాయణకు కేటాయించిన సంగతి తెలిసిందే.

Next Story
Share it