బినామీ కంపెనీతో రంగంలోకి !

ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి పార్టీల మధ్య ఇప్పుడు క్విడ్ ప్రో కో సాగుతోంది అని ఐఏఎస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. పార్టీల బలాల ఆధారంగా కాంట్రాక్టులు...వాటాల పంపిణీ జరుగుతోంది అని పెద్ద ఎత్తున ప్రచారం ఉంది. అందులో భాగంగానే కూటమిలో ఒక ప్రధాన భాగస్వామి పార్టీకి చెందిన కీలక నేత ఒకరు లింగాను రంగంలోకి దించి ఐదు వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ను దక్కించుకోవాలని స్కెచ్ వేశారు. లింగా ఎప్పటి నుంచో ఆ పార్టీ కోసం...ఆ నేతకు బినామీగా వ్యవహరిస్తున్నారు అనే ప్రచారం అధికార వర్గాల్లో ఉంది. కొద్ది రోజుల గ్యాప్ తర్వాత లింగా..ది రింగ్ లీడర్ కూటమి సర్కార్ లో మళ్ళీ ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న ఒక మంత్రికి చెందిన శాఖలో అన్నీ ఆయనే చూస్తున్నారు అనే ప్రచారం ఆ శాఖ వర్గాల్లోనే ఉంది. గత ఏడాది ఆ మంత్రి శాఖలో ఏకంగా ఆరు వేల కోట్ల రూపాయల పనుల కేటాయింపు...ఆ ముడుపుల వసూళ్లు అంతా ఆయనే చూసుకున్నారు అనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో ఉంది.
అంతే కాదు..పలు కీలక జిల్లాల్లో ఆయన తెర వెనక ఉండి ప్రత్యేక టీం లతో ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు అని చెపుతున్నారు. ఇప్పుడు ఆయనే మరో భారీ ప్రాజెక్ట్ కోసం ఒక బినామీ కంపెనీతో ఎంట్రీ ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో ఒకప్పుడు క్విడ్ ప్రో కో ప్రభుత్వం..కాంట్రాక్టు సంస్థలు ..కంపెనీల మధ్య ఉండేది. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీల మధ్య కూడా నీకు ఇది..నాకు అది అనే మోడల్ సాగుతోంది అని చెపుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో వాటాల పంపకం అన్నీ ఒక లెక్క ప్రకారమే సాగుతున్నాయి అనే ప్రచారం పెద్ద ఎత్తున ఉంది. ఒక పార్టీకి చెందిన వాళ్లకు కొన్ని విద్యుత్ ప్రాజెక్టులు...మరో పార్టీ కి చెందిన వాళ్లకు విద్యుత్ ప్రాజెక్ట్ ల కాంట్రాక్టులు.
ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం జిల్లా యాడికి మండలం కమలంపాడులో జెన్ కో చేపడుతున్న పంప్డ్ స్టోరేజి ప్రాజెక్ట్ కోసం లింగా టీం రంగంలోకి దిగినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి ఈ పనిపై చాలా ముందుగానే ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ఒక బడా కాంట్రాక్టు సంస్థ కన్నేసి పెట్టడంతో అంతా సిద్ధం చేసుకుంది. కానీ ఊహించని విధంగా ఇప్పుడు కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న మంత్రి తరపున లింగా టీం ఎంట్రీ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యుత్ శాఖలో చక్రం తిప్పుతున్న ఉన్నతాధికారికే ప్రభుత్వ పెద్దలు ఈ బాధ్యత అప్పగించినట్లు చెపుతున్నారు. ఎలాగైనా చేసి..ఇతర సంస్థలు ఏవీ కూడా పోటీలోకి రాకుండా..ఒక వేళ వచ్చినా కూడా తాము చెప్పిన వాళ్ళకే టెండర్ దక్కేలా చూడాలని లింగా టీం విద్యుత్ శాఖలోని ఆ పవర్ ఫుల్ అధికారికపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు చెపుతున్నారు.
జెన్ కో 359 హెక్టార్లలో 4900 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ పనులు చేపడుతోంది. ఈ టెండర్ కోసమే ఇప్పుడు లింగా టీం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. అమరావతిలో ఎంపిక చేసిన సంస్థలకు ఒక ప్లాన్ ప్రకారమే పనులు అప్పగించారు అని...అలాగే ఇప్పుడు ఈ కాంట్రాక్టు కూడా తాము చెప్పిన వాళ్లకు దక్కేలా పావులు కదుపుతున్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న పార్టీ తరపున ఒకరు...ప్రభుత్వ పెద్దల వద్ద పట్టు ఉన్న ఒక మెగా కాంట్రాక్టర్ ఈ పనుల కోసం పట్టుబడుతుండంతో ఈ పనుల కేటాయింపు కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతోంది అని...ఇలా కాంట్రాక్టుల పంపకాల కోసం ప్రజలకు ఉపయోగపడే పనుల్లో జాప్యం చేయటం సరికాదు అనే చర్చ సాగుతోంది. మరి ఈ టెండర్ ఎవరికీ దక్కుతుందో చూడాలి.



