సాక్షి, విజయసాయిరెడ్డిలకు ఏ బీ వెంకటేశ్వరరావు లీగల్ నోటీసులు
ఏ బీ వెంకటేశ్వరరావు వర్సెస్ ఏపీ సర్కారు పోరు కొత్త మలుపు తిరిగింది. తాజాగా ఏపీ ప్రభుత్వం ఈ సీనియర్ ఐపీఎస్ అధికారిని సస్పెండ్ చేయాల్సిందిగా కేంద్రానికి సిఫారసు చేసింది. అధికార వైసీపీ ఎప్పటి నుంచో ఆయనపై గుర్రుగా ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో ఆయన తమను రాజకీయంగా టార్గెట్ చేశారన్నది ఆ పార్టీ నేతల ఆరోపణ. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇదే విషయాన్ని పలుమార్లు బహిరంగంగానే వ్యక్తపర్చారు. ఏపీ సర్కారు ఆయన్ను సస్పెండ్ కు సిపారసు చేసిన తరుణంలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఏ బీ వెంకటేశ్వరరావు గత నెలలోనే వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, సాక్షి పత్రిక యాజమాన్యానికి, ఎడిటర్ కు, సజ్జల రామక్రిష్ణారెడ్డి, రామచంద్రమూర్తికి లీగల్ నోటీసులు పంపారు.
తనపై చేసిన నిరాధారమైన ఆరోపణలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని..లేదంటే పరువు నష్టం కేసు ఎదుర్కొవటానికి సిద్ధంగా ఉండాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో తనపై నిరాధారమైన ఆరోపణలు పేర్కొన్నారు.అప్పటి మంత్రి నారాయణ కాలేజీ నుంచి 50 కోట్ల రూపాయలను తరలిస్తున్న ఓ వాహనాన్ని ఓ చెక్ పోస్టు వద్ద అడ్డగిస్తే అక్కడి పోలీసులకు ఆనా డు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏ బీ వెంకటేశ్వరరావు నుంచి ఫోన్ చేసి..ఎస్కార్ట్ తో ఆ నిధులు అక్కడ నుంచి తరలించారని ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు. ఇది ఏ మాత్రం సరికాదన్నారు.