బిట్స్ కు 70 ఎకరాలు కేటాయిస్తూ జీవో జారీ
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి లో ఐటి టవర్ రానుంది. ఈ టవర్ ను కూడా ప్రముఖ నిర్మాణ సంస్థ లార్సన్ అండ్ టూబ్రో ( ఎల్ అండ్ టి) నిర్మించనుంది. దీని కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎల్ అండ్ టి కి పది ఎకరాలు కేటాయించింది. గతంలో కూడా ఎల్ అండ్ టి నే ఏపీఐఐసి తో కలిసి గన్నవరం సమీపంలోని కీసరపల్లి వద్ద మేధా టవర్ ను డెవలప్ చేసింది. ఇది జరిగింది కూడా రాష్ట్ర విభజన తర్వాత అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలోనే. ఇప్పుడు మళ్ళీ రెండవ సారి టీడీపీ సారథ్యంలోని కూటమి సర్కారు అమరావతిలో ఐటి టవర్ బాధ్యతను ఎల్ అండ్ టి కి అప్పగించింది. దీంతో పాటు కొత్తగా అమరావతిలో బిర్లా ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (బిట్స్) కు కూడా ఏపీ ప్రభుత్వం 70 ఎకరాలు కేటాయిస్తూ జీవో జారీ చేసింది.
ఐఆర్ సిటిసి అమరావతిలో బడ్జెట్ హోటల్ ను నెలకొల్పటానికి భూమి కోరగా..ఈ ప్రతిపాదను పరిశీలించిన ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. గతానికి బిన్నంగా ఈ సారి ప్రభుత్వం అమరావతి లో ఐటి టవర్ కోసం కేవలం పది ఎకరాలు మాత్రమే కేటాయించింది అంటే కొంత లో కొంత వాస్తవిక అంచలనతోనే వెళ్ళింది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎందుకంటే రాజధాని అమరావతికి ఇప్పటికిప్పుడు పెద్ద ఎత్తున ఐటి కంపెనీలు వచ్చే అవకాశం ఉండదు. అమరావతి ఒక షేప్ కు వచ్చిన తర్వాత సంగతి ఏమో కానీ...ఇప్పుడు అయితే ఏపీలో ఐటి అంటే ఎక్కువ మంది వైజాగ్ వైపు చూస్తారు అనటంలో ఏ మాత్రం సందేహం లేదు అనే చెప్పొచ్చు.