చంద్రబాబు బూట్లు నాకుతున్న నిమ్మగడ్డ
ఎపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ కింద పనిచేస్తున్నారా? లేక ఆయన గవర్నర్ కంటే పెద్దా? అని ఏపీమంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించిన అంశంపై ప్రభుత్వ ఆర్డినెన్స్ ను తిరస్కరించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు రమేష్ కుమార్ లేఖ రాసినట్లు వచ్చిన వార్తలపై నాని మండిపడ్డారు. గవర్నర్ కు సలహాలు ఇచ్చే స్థాయి ఆయనకు ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు బూట్లు నాకుతున్న రమేష్ కుమార్ కు అసలు తాము ఎన్నికల కమిషనర్ గా గుర్తించం అని ప్రకటించారు. వేసవిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు పెడతామని తెలిపారు. ప్రజల ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతోనే తాము ఇఫ్పుడు ఎన్నికలకు సిద్ధంగా లేమన్నారు. అంతే కానీ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు తాము ఎన్నికలకు భయపడటం లేదన్నారు. ప్రభుత్వాన్ని, ప్రజలను, గవర్నర్‌ను లెక్కచేయని నిమ్మగడ్డ రమేష్‌ను ఎన్నికల కమిషనర్‌గా తాము గుర్తించమని పేర్కొన్నారు.
2018 జూన్ నెలలో ఎన్నికలు నిర్వహించాల్సిన నిమ్మగడ్డ.. ఇప్పుడు శ్రీరంగ నీతులు చెబుతున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో నాలుగు సంవత్సరాల పాటు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని ఆయన ప్రశ్నించారు. అప్పుడు నిమ్మగడ్డ రమేష్ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నాడా అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికలు పెట్టినప్పుడు తాము 90 శాతంపైగా సీట్లు దక్కించుకుంటామని..టీడీపీ అడ్రస్ లేకుండా పోతుందని తెలిపారు. తాము 90 శాతం సీట్లు సాధించకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తామని తెలిపారు. కార్మికుల సొమ్మును దోచుకుతినే అచ్చెన్నాయుడు, గాలి నాయుడు, ఫేక్ పార్టీ నాయకులు ఎవరైనా తన సవాల్ స్వీకరించాలని కొడాలి నాని ఛాలెంజ్ విసిరారు. తెలంగాణలో మాదిరే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కనుమరుగు కాక తప్పదని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.