జగన్ ను బెదిరించే వాడు..భయపెట్టేవాడు భూమ్మీద పుట్టలేదు
ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ను భయపెట్టేవాడు..బెదిరించేవాడు ఇంత వరకూ ఈ భూమ్మీద పుట్టలేదన్నారు. జీవితకాలంలో ఎవరైనా దీనికోసం ట్రైచేయండి అంటూ వ్యాఖ్యానించారు. ఈ విషయం పేపర్ పులులకు కూడా చెబుతున్నామన్నారు. జగన్ కు ప్రజల అండ..దేవుడు, వైఎస్ఆర్ అండ ఉందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉడతఊపులకు ఎవరూ బెదిరిపోరని అన్నారు. కొడాలి నాని సినిమా టిక్కెట్ల వ్యవహారంపైనా స్పందించారు. తమ ప్రభుత్వం ముగ్గురు, నలుగురు హీరోలు..ముగ్గురు, నలుగురి నిర్మాతల కోసం నిర్ణయం తీసుకోదన్నారు. అందరి ప్రయోజనాలు కాపాడేందుకు వీలుగా నిర్ణయం ఉంటుందని చెప్పారు. గతంలో సినిమాలు ఏభై రోజులు, వంద రోజులు నడిచేవన్నారు.. ఇప్పుడు స్క్రీన్ల సంఖ్య పెరగటంతో తొలి వారం, రెండు వారాల్లో భారీ ఎత్తున రేట్లు పెంచుకునేందుకు కొంత మంది ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
ఇది మంచిదికాదన్నారు. సినిమా ఎవరిదైనా రేటు ఒకటే ఉండాలన్నదే తమ విధానం అన్నారు. పవన్ కళ్యాణ్ ఒక్కడి గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఆయన సినిమా హిట్ అయితే మాకేంటి? ఫ్లాప్ అయితే మాకేంటన్నారు. ఇష్టారాజ్యంగా టిక్కెట్ రేట్లు పెంచటాన్ని తాము సమర్ధించం అన్నారు. నిర్మాణ వ్యయం పెరిగింది రేట్లు పెంచుకోవటానికి అనుమతి ఇవ్వాలని కొంత మంది కోర్టుకు వెళితే కమిటీ వేసి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోర్టు చెప్పిందన్నారు. అయితే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కమిటీ వేయలేదన్నారు. తాము అందరికీ మేలు చేసేలా నిర్ణయం తీసుకుంటామన్నారు.