Telugu Gateway
Andhra Pradesh

మెగా వాట్ల లెక్కన వసూళ్లు!

మెగా వాట్ల లెక్కన వసూళ్లు!
X

అవాక్కు అవుతున్న అధికారులు

కూటమి నేతలకూ వాటాలు!

ఆయన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పవర్ ఫుల్ మంత్రి. ఆయన ఒక పెద్ద టీం నే నడుపుతున్నారు. అన్ని తెర వెనక లావాదేవీలను ఈ టీం మాత్రమే డీల్ చేస్తుంది. కిమ్ గా పేరున్న ఆ పవర్ ఫుల్ మంత్రి సన్నిహితుడి డైరెక్షన్ లో నడిచే అక్రమ దందా ఇది అంతా. ప్రధానంగా ఈ కిమ్ కలెక్షన్స్ మరీ ముఖ్యంగా విద్యుత్ ప్రాజెక్ట్ ల విషయంలో పీక్ కు వెళ్లాయని టీడీపీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. ఈ టీం లో ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తనయుడు కూడా భాగస్వామి కావటం విశేషం. గత ప్రభుత్వంలో అయితే అత్యున్నత స్థానంలో ఉన్న ఐఏఎస్ అధికారి కొడుకే స్వయంగా మైనింగ్ తో పాటు పలు ప్రాజెక్ట్ ల్లో ఇన్వాల్వ్ అయితే ఇప్పుడు కూడా ఒక రిటైర్డ్ ఐఏఎస్ తనయుడు ఈ టీంతో కలిసి ముందుకు సాగుతున్నారు అని చెపుతున్నారు. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దగ్గర దగ్గర ఒక పది కంపెనీల విద్యుత్ ప్రాజెక్ట్ లకు అనుమతులు మంజూరు చేసింది. ఈ కంపెనీ ల మొత్తం సామర్ధ్యం ఆరు వేల మెగా వాట్లకు పైనే ఉంది.

అయితే అధికారంలో ఉన్న వాళ్ళు ఈ ప్రాజెక్ట్ ల ద్వారా వచ్చే పెట్టుబడులు..ఉద్యోగాల లెక్కలు చెపుతారు కానీ...తెర వెనక సాగే దందాల గురించి చెప్పరనే విషయం తెలిసిందే. అయితే విద్యుత్ శాఖలోని అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ ల అనుమతులకు సంబంధించి మెగా వాట్ కు పదిహేను లక్షల రూపాయల లెక్కన కిమ్ టీం కలెక్షన్స్ చేసినట్లు అధికార వర్గాలు చెపుతున్నాయి. టీడీపీ వర్గాల్లో సైతం ఇదే అంశంపై విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. టాటా లాంటి ఒకటి రెండు సంస్థల ను మినహాయించి కొత్తగా అనుమతులు ఇచ్చిన అన్ని సంస్థల దగ్గర భారీ ఎత్తున వసూళ్లు సాగాయని...ఈ మొత్తం దగ్గర దగ్గర వెయ్యి కోట్ల రూపాయల వరకు ఉంటుంది అని వెల్లడించారు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే ఎకో రెన్ ఎనర్జీ ఇండియా కి చెందిన 430 మెగావాట్ల విండ్ పవర్ సామర్ధ్యాన్ని అయానా రెన్యువబుల్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన కంపెనీలకు బదిలీ చేయటానికి కూడా ఎస్ఐపీబి ఆమోదం తెలిపింది. ఇలాంటి గోల్ మాల్ వ్యవహారాలు ఇందులో ఎన్నో ఉన్నాయి.

ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఇప్పుడు అవినీతి, ప్రాజెక్ట్ ల్లో కూడా వాటాలు పంచుకుంటున్నారు అనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. ఎందుకంటే ఇందులో ఒక కంపెనీ ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న ఒక నేతకు చెందిన బినామీ కంపెనీ గా ప్రచారం జరుగుతోంది. దీని వెనక ఆ నేతకు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తుల మనుషులు ఉండటమే ఈ అనుమానాలు మరింత బలబడటానికి కారణం అవుతున్నాయి అనే చెప్పొచ్చు. అందరం కలిసి ప్రజలకు మేలు చేస్తామని అధికారంలోకి వచ్చిన వాళ్ళు అందరూ కలిసి ఎవరి వాటాలు వాళ్ళు పంచుకుంటున్నారు అన్న చందంగా పరిస్థితి తయారు అయింది అని ఒక సీనియర్ ఐఏఎస్ అభిప్రాయపడ్డారు. విద్యుత్ ప్రాజెక్ట్ ల తో పాటు పలు విషయాల్లో ఎవరికి అందాల్సిన వాటాలు వాళ్లకు అందుతుండంతో అంతా గప్ చుప్ గా సాగిపోతోంది.

Next Story
Share it