భోగాపురం ఎయిర్ పోర్ట్ సమీపంలో ఇది కొత్త భూదందా

కీలక మంత్రి తరపున కిమ్...ఆయన సన్నిహిత రాజ్య సభ సభ్యుడు
రైతులను బెదిరించిన మరీ భూములు కొనుగోలు
ల్యాండ్స్ ...ల్యాండ్స్ ...ల్యాండ్స్. ఆంధ్ర ప్రదేశ్ లో అధికార పార్టీ నేతల స్కాం లకు భూములే ఇప్పుడు ప్రధాన అస్త్రంగా మారాయి. వైజాగ్ లో దసపల్లా భూముల సెటిల్మెంట్ అయిపోయింది. మాజీ సిఎస్ ల్యాండ్స్ తో డీల్ కుదిరిపోయింది. అందుకే ఈ వ్యవహారాల్లో ఎవరిపై ఎలాంటి చర్యలు లేవు. ఇవి పాత కేసులు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ఒక కీలక మంత్రికి చెందిన కిమ్ తో పాటు ఆయనకు అత్యంత సన్నిహితుడిగా ప్రచారంలో ఉన్న ఒక రాజ్య సభ సభ్యుడు కలిసి విజయనగరం జిల్లాలో తక్కువలో తక్కువగా రెండు వేల కోట్ల రూపాయల విలువైన భూములను చేజిక్కించుకున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ప్రభుత్వం ఈ ప్రాంతంలో రిలయన్స్ ప్రాజెక్ట్ కోసం భూ సేకరణకు శ్రీకారం చుట్టింది. కంపెనీ అవసరానికి కొంత అయితే ....మంత్రి తరపున రంగంలోకి దిగిన వాళ్ళు కంపెనీ కి కావాల్సిన దానికంటే భారీ మొత్తంలో భూమిని సేకరించారు అని చెపుతున్నారు.
ఆ ప్రాంతంలో ఎకరా ధర కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయల వరకు ఉండగా...భూ సేకరణలో ఈ భూమి పోతుంది అని చెప్పి ఆ ప్రాంతంలో రైతుల దగ్గర నుంచి 50 నుంచి 70 లక్షల రూపాయలకే భూములను ఈ టీం బినామీ పేర్లతో సేకరించినట్లు టీడీపీ వర్గాలే చెపుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థకు మొత్తం 850 ఎకరాలు అవసరం కాగా.. ఈ ప్రాంతంలో మొత్తం 3000 ఎకరాలు సేకరించినట్లు చెపుతున్నారు. అయితే ఇందులో అధికారికంగా కొంత అయితే...అనధికారికంగా భూ సేకరణ తప్పదు అని చెప్పి సేకరించింది ఎక్కువ మొత్తంలో ఉన్నట్లు చెపుతున్నారు. ఇందులో కంపెనీ అవసరాలకు పోను రెండు వేల ఎకరాల భూములను కిమ్ తో పాటు రాజ్య సభ సభ్యుడితో కూడిన టీం టార్గెట్ చేసుకుంది. దీనికి ప్రధాన కారణం ఈ భూములు అన్నీ కూడా కొత్తగా విజయనగరం జిల్లాలో ప్రారంభం అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి దగ్గరగా ఉండటమే. ఇది అంతా కూడా నందిగం గ్రామంతో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు చెపుతున్నారు. ఇందులో కొన్ని డీ పట్టా ల్యాండ్స్ ఉంటే..ఎక్కువ శాతం మాత్రం పట్టా భూములే ఉన్నట్లు చెపుతున్నారు.
ఒక వైపు వైజాగ్ లో అత్యంత కీలకమైన భూములు రకరకాల మార్గాలతో దక్కించుకుంటున్న నేతలు ఇప్పుడు విజయనగరం జిల్లాలో కూడా ముఖ్యంగా ఎయిర్ పోర్ట్ ప్రాంతంలోని భూములపై కన్నేసి తమ పని పూర్తి చేసుకుంటున్నారు. కొంత మంది రైతులు భూములు ఇవ్వటానికి నిరాకరించిన వాళ్ళను రకరకాలుగా బెదిరించి తమ పని పూర్తి చేసుకున్నట్లు సమాచారం. దీని కోసం రెవెన్యూ శాఖతో పాటు అన్ని వ్యవస్థలను ఉపయోగించుకున్నట్లు ఒక అధికారి వెల్లడించారు. అధికార పార్టీ నేతల భూ దాహానికి అంతులేకుండా పోతోంది అనే విమర్శలు సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. ఈ కీలక నేతలు దక్కించుకున్న ఈ భూమి విలువ ఇప్పుడే రెండు వేల కోట్ల రూపాయలకు పైగా ఉంటే ...రానున్న రెండు, మూడేళ్ళలో అక్కడ చోటు చేసుబోయే అభివృద్ధితో ఆ ప్రాంతంలో భూముల ధరలకు మరింత రెక్కలు రావటం ఖాయం. అధికారాన్ని అడ్డంపెట్టుకుని కీలక నేతలు ఈ భూములను టార్గెట్ చేసుకున్నట్లు చెపుతున్నారు. వైసీపీ లో జరిగిన దానికంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనే ఇలాంటి దందాలు భారీ ఎత్తున సాగుతున్నట్లు అధికార వర్గాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి.



