Telugu Gateway
Andhra Pradesh

ఆ తర్వాత రాజ్య సభకు!

ఆ తర్వాత రాజ్య సభకు!
X

ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ వర్గాల్లో బాగా వినిపిస్తున్న పేరు కిలారి రాజేష్. ఇప్పటి వరకు తెర వెనక రాజకీయాలకు పరిమితం అయిన ఆయన ఇక నుంచి తెర ముందుకు కూడా రాబోతున్నట్లు టీడీపీ వర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతోంది. మేలో జరిగే మహానాడు తర్వాత చోటు చేసుకునే పొలిట్ బ్యూరో పునర్వ్యవస్థీకరణంలో భాగంగా మంత్రి నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడు అయిన కిలారి రాజేష్ ను పార్టీలో అత్యున్నత నిర్ణాయక మండలిగా ఉన్న పొలిట్ బ్యూరో లోకి తీసుకునే అవకాశం ఉంది అన్ని పార్టీలోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. గతానికి భిన్నంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సారి క్యాబినెట్ లో కూడా ఎక్కువ మంది కొత్తవాళ్లకు చోటు కల్పించిన సంగతి తెలిసిందే. సీనియర్లు చాలా మందిని పక్కనబెట్టారు.

ఇది అంతా కూడా లోకేష్ కు అటు పార్టీ పరంగా...ఇటు ప్రభుత్వ పరంగా లైన్ క్లియర్ చేయటం కోసం చేస్తున్న పనే అనే అభిప్రాయం ఎక్కువ మంది నేతల్లో ఉంది. మంత్రి వర్గం మోడల్ లోనే ఇప్పుడు పొలిట్ బ్యూరో లోకి కూడా పెద్ద ఎత్తున లోకేష్ టీం ను తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు అని...అందులో భాగంగానే కిలారి రాజేష్ కు కీలక పదవి ఇవ్వబోతున్నట్లు చెప్తున్నారు. తొలుత పొలిట్ బ్యూరో లోకి తీసుకుని ఆ తర్వాత ఆయన్ను రాజ్య సభ కు కూడా పంపే ఆలోచనలో ఉన్నారు అన్నది పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఇటీవల రాజ్య సభ సభ్యత్వం దక్కించుకున్న సానా సతీష్ కూడా మంత్రి నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడు అన్న పేరు ఉంది. కొద్ది రోజుల క్రితం వైజాగ్ లో పర్యటించిన మంత్రి నారా లోకేష్ అక్కడ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు సార్లకు మించి పార్టీ పదవులు ఎవరికీ ఉండడకూడదు అని..అందులో భాగంగా తాను కూడా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకుంటాను అని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయం అని..పార్టీ తనకు ఏ పదవి ఇస్తే దానికి అనుగుణంగా పని చేస్తాను అని ప్రకటించారు.

ఈ ప్రకటన నారా లోకేష్ రాబోయే రోజుల్లో చేయనున్న పార్టీ కమిటీల పునర్వ్యవస్థీకరణ ను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా చేశారు అనే చర్చ పార్టీ నేతల్లో సాగుతుంది. మూడు సార్లు పార్టీ పదవులు అన్న లైన్ ప్రకారం పొలిట్ బ్యూరో లో ఉన్న సీనియర్లు చాలా మందిని ఈ సారి బయటకు పంపటానికే లోకేష్ వైజాగ్ లో చాలా ముందుగా ఈ ప్రకటన చేశారు అని చెపుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు లోకేష్ అభీష్టానికి అనుగుణంగానే సాగుతున్నాయనే చర్చ పార్టీ నేతల్లో ఉంది. ప్రస్తుతం కిలారి రాజేష్ బ్యాక్ ఎండ్ లో ఉంటూ నారా లోకేష్ డైరెక్షన్స్ తో పనులు చేస్తున్నారు అని చెపుతున్నారు. మరి ఇప్పుడు టీడీపీ నేతలు చెపుతున్నట్లు ఆయనకు పొలిట్ బ్యూరో పదవి దక్కితే ఇక తెర ముందుకు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయనే చెప్పొచ్చు.

ఇది ఇలా ఉంటే టీడీపీ లోని కొంత మంది సీనియర్లు అధిష్టానం తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వీళ్ళు అంతా కూడా అదను కోసం వేచిచూస్తున్నారు. కొంత మంది సీనియర్లు అయినా త్వరలోనే పార్టీ, ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై బహిరంగంగా మాట్లాడే అవకాశం ఉంది అని చెపుతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ లో కూడా సీనియర్ లు..జూనియర్లు అంటూ రచ్చ సాగిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ అధికారంలో ఉన్నందున ఈ వ్యవహారాన్ని రాబోయే రోజుల్లో ఎలా డీల్ చేస్తుందో చూడాలి. ఇప్పటికే కొంత మంది నేతలు అయితే అధిష్టానానికి ఏ మాత్రం ఛాన్స్ దొరికినా కూడా ఇండికేషన్స్ ఇస్తున్నారు. కొన్ని విషయాల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లు ఇద్దరూ కూడా జగన్ మోడల్ ను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది అని ఒక సీనియర్ మంత్రి అభిప్రాయపడ్డారు.

Next Story
Share it