Telugu Gateway
Andhra Pradesh

ఐఏఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన వ్యవహారం !

ఐఏఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన వ్యవహారం !
X

ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండే అధికారులు ప్రభుత్వంలో ఎక్కడైనా సమస్యలు ఉంటే అవి పరిష్కరించి పాలన సాఫీగా సాగటంలో తమ వంతు పాత్ర పోషించాలి. కానీ ఏకంగా సీఎంఓలో ఉన్న అధికారులే ప్రభుత్వానికి సమస్యగా మారితే. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో అదే జరుగుతోంది. అది కూడా తరచూ వివాదాస్పద చర్యలతో వార్తల్లో నిలుస్తూ ప్రభుత్వాన్ని చిక్కుల్లో నెడుతున్నా కూడా ఆ ఐఏఎస్ అధికారి మీద ఈగ వెళ్లటానికి వీలు లేదు అన్న చందంగా ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు ఐఏఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కార్తికేయ మిశ్రా ఆంధ్ర ప్రదేశ్ సీఎంఓ లో కార్యదర్శిగా ఉన్న అధికారి. కొద్ది నెలల క్రితమే ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన సందర్బంగా అధికార టీడీపీ కే చెందిన నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తో దురుసుగా వ్యవహరించి విమర్శలు ఎదుర్కొన్నారు. అదే సమయంలో ఎంపీ కూడా ఆ ఐఏఎస్ అధికారికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు మీడియా లో వార్తలు వచ్చాయి. విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర వరకు వెళ్లినా కూడా పెద్దగా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఇక తన జోలికి ఎవరూ వచ్చే అవకాశం లేదు అనుకున్నారేమో ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా మరో సారి తన అధికారాన్ని చూపించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. కృష్ణా కలెక్టర్ తో పాటు ఎస్పీ తో కూడా కార్తికేయ మిశ్రా అనుచితంగా వ్యవహరించినట్లు ఆంధ్ర జ్యోతి పత్రికలో ప్రముఖంగా వచ్చింది. ఈ వార్తపై ఎవరూ కిక్కురుమనకపోవటంతో ఇది అంతా నిజమే అని తేలిపోయింది.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ పర్యటన ముగించుకుని వెళుతున్న సమయంలో ఆయన తన నోటికి పనిచెప్పినట్లు మీడియాలో ప్రముఖంగా వచ్చింది. అంతే కాకుండా కృష్ణా కలెక్టర్ కు ఏకంగా కొరియర్ లో షూస్ పంపటం మరీ వివాదాస్పదంగా మారింది. ఇదే అంశంపై సీఎం కూడా నివేదికగా తెప్పించుకున్నట్లు చెపుతున్నారు. ఇది నిజం అని తేలినట్లు అధికార వర్గాలు చెపుతున్నాయి. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే ఎవరైనా ఐఏఎస్ ల విషయంలో ఇబ్బంది కరంగా వ్యవహరిస్తే ఆగమేఘాల మీద స్పందించే ఐఏఎస్ అసోసియేషన్ ఒక సీఎంఓ అధికారి...మరో ఐఏఎస్, ఐపీఎస్ అధికారి విషయంలో అనుచితంగా వ్యవరించినా మౌనంగా ఉండటం కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయంగా మారింది. నిజంగా కృష్ణా కలెక్టర్, ఎస్పీ ఏదైనా తప్పు చేస్తే ముందు నోటీసు లు ఇచ్చి వివరణ తీసుకోవాలి అని...కానీ ఏ మాత్రం సంబంధం లేని కార్తికేయ మిశ్రా వాళ్లపై బహిరంగంగా విమర్శలు చేస్తూ..ఇష్టానుసారం మాట్లాడం ఏ మాత్రం సరికాదు అని అధికారులు చెపుతున్నారు.

ఇంత జరిగినా కూడా సీఎంఓ కార్యదర్శి కార్తికేయ మిశ్రా విషయంలో ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఒక మంత్రి మాత్రం ఆయన ఎంతో కష్టపడి పనిచేస్తారు అని...అతనిపై వివాదాలు సృష్టించటం సరికాదు అని అధికారుల వద్ద వ్యాఖ్యానించటంతో అవాక్కు అవటం వాళ్ళ వంతు అయింది. అసెంబ్లీ సమావేశాలు అయిపోయినందున సీఎంఓ లో కూడా కొన్ని మార్పులు, చేర్పులు ఉన్నాయి అని..ఇప్పుడు అయినా కార్తికేయ మిశ్రా మీద వేటు పడుతుందా లేదా అన్న ఆసక్తి ఐఏఎస్ వర్గాల్లో ఉంది. ఇంత జరిగినా కూడా ప్రభుత్వం ఆయన విషయంలో చూసీ చూడనట్లు వదిలేస్తే మాత్రం అది ప్రభుత్వ ప్రతిష్ఠకే మచ్చగా మారుతుంది అని ఒక సీనియర్ ఐఏఎస్ అభిప్రాయపడ్డారు. అయితే కీలక మంత్రి అండదండలు ఉన్నందున ఆయన్ను టచ్ చేయకపోవచ్చు అన్న అభిప్రాయాన్ని కూడా కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. ఆ మంత్రి వైఖరి ఇప్పుడు తాము అనుకున్నట్లు పని చేసుకుంటూ పోవాలే తప్ప...మీడియా ఏమి అనుకుంటుంది...జనం ఏమి అనుకుంటున్నారు అనే విషయం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్న చందం గా వ్యవహరిస్తున్నారు అని సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారు. మరి రాబోయే రోజుల్లో కార్తికేయ మిశ్రా విషయంలో చంద్రబాబు సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Next Story
Share it