Telugu Gateway
Andhra Pradesh

జగన్ ఉక్కు సంకల్పం ఇంత వీకా?!

జగన్ ఉక్కు సంకల్పం ఇంత వీకా?!
X

కడప స్టీల్ ...మూడేళ్ళలో మూడు కంపెనీలు మార్చారు

కడప స్టీల్. మళ్ళీ పాత కథే. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. 2019 డిసెంబర్ లో కడప స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన అయన ..మూడేళ్ళలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తానన్నారు. కానీ ఈ మూడేళ్ళలో మూడు కొత్త కంపెనీల పేర్లు తెరపైకి వచ్చాయి కానీ ..ప్రాజెక్ట్ మాత్రం అడుగు ముందుకు పడలేదు. సీఎం జగన్ చెప్పిన ప్రకారం సరిగ్గా ప్రాజెక్ట్ పూర్తి కావాల్సిన సమయానికి మళ్ళీ ఒక కొత్త కంపెనీ తెరమీదకు వచ్చింది. జగన్ సీఎం అయిన తర్వాత తొలుత లిబర్టీ స్టీల్ ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తుంది అన్నారు. కానీ అది ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయి వెనక్కి తగ్గింది. అది అయ్యాక రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఎస్సార్ స్టీల్ కడప స్టీల్ నిర్మాణం చేపడుతుంది అని ప్రకటించారు. ఇది కూడా అవుట్ . ఇప్పుడు కొత్తగా కడప లో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి జిందాల్ తెరమీదకు వచ్చింది.

8800 కోట్లతో జిందాల్ స్టీల్ ఇక్కడ ప్లాంట్ పెడుతుందని..తొలిదశలో మాత్రం ఏటా పది లక్షల టన్నులు ఉత్పత్తి చేసేలా 3300 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుందని తెలిపారు. ఎన్నికలకు మూడేళ్ళ ముందు శంఖుస్థాపన చేస్తే దాన్ని మోసం అంటారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పనులకు టెంకాయ కొడితే దాన్ని చిత్తశుద్ధి అంటారు అంటూ జగన్ కడప స్టీల్ ప్లాంట్ సమావేశంలోనే చెప్పారు. మరి మూడేళ్ళ తర్వాత కూడా ఇంకా కంపెనీలను మార్చే పనిలోనే ఉన్నారు తప్ప ఇంతవరకు ప్రాజెక్ట్ మాత్రం వాస్తవరూపం దాల్చలేదు. ఈ సారి అయినా ప్రాజెక్ట్ పూర్తి అవుతోందో లేదో చూడాలి మరి. ఇంకా ఈ ప్రభుత్వం కాల పరిమితి ఏడాదిన్నర ఉంది. అప్పటిలోగా అయితే అయితే ఇది పూర్తి అయ్యే అవకాశాలు లేవు. విభజన చట్టం ప్రకారం కేంద్రమే కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాల్సి ఉంది. ఇదే అంశంపై గతంలో చంద్రబాబు పై విమర్శలు చేసిన జగన్ తాను వచ్చాక కూడా చేతులు ఎత్తేసి సొంతంగానే స్టీల్ ప్లాంట్ అంటూ ప్రైవేట్ కంపెనీల వెంటబడుతున్నారు. అది కూడా ఇప్పటిదాకా ముందుకు సాగలేదు.

Next Story
Share it