Telugu Gateway
Andhra Pradesh

మరో సారి టార్గెట్ అయిన ఎన్టీఆర్

మరో సారి టార్గెట్ అయిన ఎన్టీఆర్
X

టాలీవుడ్ లోని టాప్ హీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ మరో సారి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది మే లో హైదరాబాద్ వేదికగా దివంగత ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరిగాయి. మే 20 ఎన్టీఆర్ పుట్టిన రోజు అన్న విషయం తెలిసిందే. అప్పటికే స్నేహితులతో కలిసి విదేశీ పర్యటన పెట్టుకున్నందున ఈ కార్యక్రమానికి రాలేక పోతున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ ఆ కార్యక్రమ నిర్వాహకులకు వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి. అయినా సరే టీడీపీ అభిమానులు మాత్రం ఎన్టీఆర్ ను అప్పటిలో పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ మరో సారి తీవ్ర విమర్శలు చవి చూడాల్సి వస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముసోమవారం నాడు ఢిల్లీ లో దివంగత నేత ఎన్టీఆర్ పై కేంద్రం సిద్ధం చేయించిన 100 రూపాయల స్మారక నాణేన్ని విడుదల చేశారు. ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని ఈ నాణెం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె పీ నడ్డా తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, పలువురు నాయకులు పాల్గొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు ఈ కార్యక్రమానికి ఆహ్వానం ఉన్నా కూడా దేవర సినిమా షూటింగ్ ఉండటంతో అయన దీన్ని కూడా స్కిప్ చేశారు. దీంతోనే ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

ఇంతటి కీలక కార్యక్రమానికి కేవలం షూటింగ్ పేరు చెప్పి స్కిప్ చేయటం ఏ మాత్రం సమర్థనీయం కాదు అని...షూటింగ్ ప్రమోషన్స్ లో హీరోలు అందరూ ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్న ఈ రోజుల్లో ఎన్టీఆర్ ఇంతటి కీలక కార్యక్రమానికి షూటింగ్ పేరు చెప్పి తప్పించుకోవటం ఏ మాత్రం సరికాదు అనే చర్చ టీడీపీ వర్గాల్లో సాగుతోంది. షూటింగ్ అంటే ఎంతో మంది తో ముడిపడి ఉండే అంశమే..అందులో ఎలాంటి సందేహం లేదు..కానీ ఎన్టీఆర్ పేరుతో వంద రూపాయల నాణెం విడుదల అనేది కూడా అత్యంత కీలక ఘట్టమే. ఇలా వరసపెట్టి ఎన్టీఆర్ కార్యక్రమాలకు జూనియర్ దూరంగా ఉంటూ వస్తుండటంతో అటు తెలుగు దేశం పార్టీ తో పాటు ఇటు ఎన్టీఆర్ కుటుంబంతో కూడా జూనియర్ కు దూరం మరింత పెరిగింది అనే చర్చ సాగుతోంది. ఎన్టీఆర్ పేరు చెప్పుకుని సినీ పరిశ్రమలో రాణిస్తున్న తారక్ వరసగా ఇలా చేయటం వల్ల భవిష్యత్తులో ఆయనకే నష్టం జరిగే అవకాశం ఉంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఒక సారి తప్పు జరిగితే పొరపాటు అనుకుంటారు అని..కానీ వరసగా ఇలా చేస్తుంటే మాత్రం కావాలని చేస్తున్నట్లు భావించే అవకాశాలే ఎక్కువ ఉంటాయని చెపుతున్నారు.

Next Story
Share it