Telugu Gateway
Andhra Pradesh

ప‌రుష వ్యాఖ్య‌లు అరాచ‌క పాల‌న‌కు నాంది

ప‌రుష వ్యాఖ్య‌లు అరాచ‌క పాల‌న‌కు నాంది
X

ఏపీ అసెంబ్లీలో శుక్ర‌వారం నాడు జ‌రిగిన ప‌రిణామాల‌పై శ‌నివారం నాడు నంద‌మూరి బాల‌కృష్ణ, ఎన్టీఆర్ లు వ‌ర‌స వ‌ర‌స‌గా స్పందించారు. బాల‌కృష్ణ మీడియా స‌మావేశం ఏర్పాటు చేయ‌గా..ఎన్టీఆర్ వీడియో ద్వారా త‌న స్పంద‌న తెలిపారు. ఆయ‌న ఇందులో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆ వీడియోలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..'మాట మ‌న వ్య‌క్తిత్వానికి ప్ర‌మాణం.రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు చాలా స‌ర్వ‌సాధార‌ణం.ఆ విమ‌ర్శ‌లు..ప్ర‌తి విమ‌ర్శ‌లు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై జ‌ర‌గాలే కానీ వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు..విమ‌ర్శ‌లు ఉండ‌కూడ‌దు. నిన్న అసెంబ్లీలో జరిగిన ఒక సంఘటన.. నా మనసును కలిచివేసింది. ఎప్పుడైతే మ‌నం ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌క్క‌న‌పెట్టి వ్యక్తిగ‌త దూష‌ణ‌ల‌కు దిగుతున్నామో..ముఖ్యంగా మ‌న ఆడ‌ప‌డుచుల గురించి ప‌రుష ప‌ద‌జాలంతో మాట్లాడుతున్నామో. అది ఒక అరాచ‌క ప‌రిపాల‌న‌కు నాంది ప‌లుకుతుంది. అది త‌ప్పు. స్త్రీ జాతిని గౌర‌వించ‌టం అనేది..ఆడ‌వాళ్ల‌ను..ఆడ‌ప‌డుచుల‌ను గౌరవించ‌టం అనేది మ‌న ప‌ద్ద‌తి.

మ‌న న‌వ నాడుల్లో, మ‌న ర‌క్తంలో ఇమిడిపోయిన ఒక సంప్ర‌దాయం. మ‌న సంప్ర‌దాయాల‌ను రాబోయే త‌రాల‌కు జాగ్ర‌త్త‌గా...భ‌ద్రంగా అప్ప‌గించాలే కానీ..మ‌న సంస్కృతి క‌ల‌చివేసేలా..కాల్చేయ‌టం పెద్ద త‌ప్పు. ఈ మాట‌లు నేను ఇలాంటి ఒక వ్య‌క్తిగ‌త దూష‌ణ‌కు గురైన ఒక కుటుంబానికి చెందిన స‌భ్యుడిగా మాట్లాడ‌టం లేదు. ఈ మాట‌లు ఓ కొడుకుగా..ఒక భ‌ర్త‌గా, ఓ తండ్రిగా, దేశ పౌరుడిగా సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నాను.రాజ‌కీయ నాయ‌కులు అంద‌రికీ ఒక‌టే విన్న‌పం. ద‌య‌చేసి ఈ అరాచ‌క సంస్కృతిని ఇక్క‌డితో ఆపేయండి. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడండి. రాబోయే త‌రానికి బంగారు బాట వేసేలా మ‌న న‌డ‌వ‌డిక ఉండేలా జాగ్ర‌త్త ప‌డండి.ఇది నా విన్న‌పం మాత్ర‌మే. ఇది ఇక్క‌డితో ఆగిపోతుంద‌ని మ‌న‌సారా కోరుకుంటున్నాను.' అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it