Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో రాజ‌కీయం ర‌చ్చ ర‌చ్చ‌

ఏపీలో రాజ‌కీయం ర‌చ్చ ర‌చ్చ‌
X

ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్ళ‌కుపైగా స‌మ‌యం ఉన్నా ఏపీలో రాజ‌కీయాలు రోజురోజుకు మ‌రింత వేడెక్కుతున్నాయి. అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్ష టీడీపీల మ‌ధ్య రాజకీయ ర‌చ్చ మ‌రింత ముదిరింది. తాజా గొడ‌వ‌కు కార‌ణం మాజీ మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు దివంగ‌త కోడెల శివ‌ప్ర‌సాద్ రెండ‌వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా చేసిన వ్యాఖ్య‌లే. ఆయ‌న ఈ స‌మావేశంలో ప్ర‌భుత్వంపై ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ పై తీవ్ర ప‌ద‌జాలంతో విమ‌ర్శ‌లు చేశారు . దీనికి ప్ర‌తిగా అయ్య‌న్న‌పాత్రుడి వ్యాఖ్య‌ల‌కు చంద్ర‌బాబు క్షమాప‌ణ చెప్పాలంటూ వైసీపీ ఎమ్మెల్యే జోగు ర‌మేష్ క‌ర‌క‌ట్ట‌పై ఉన్న చంద్ర‌బాబు నివాసం ముట్ట‌డికి వెళ్ళారు. దీంతో ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. చంద్ర‌బాబు నివాసంపై రాళ్ళు వేశార‌ని టీడీపీ నేత‌లు ఆరోపిస్తుంటే...జోగు ర‌మేష్ కారుపై దాడి చేశారంటూ వైసీపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. చంద్ర‌బాబు, నారా లోకేష్ ల ప్రోద్భ‌లంతోనే అయ్య‌న్న‌పాత్రుడు ఈ కామెంట్స్ చేశార‌ని జోగు ర‌మేష్ ఆరోపించారు.

టీడీపీ నేత‌లు మాత్రం ప్ర‌తిప‌క్ష నేత ఇంటిపైకి ఏకంగా వైసీపీ ఎమ్మెల్యే మ‌నుషులను తీసుకుని రావ‌టం ఏమిటి? రాష్ట్రంలో అస‌లు పోలీసులు ఉన్నారా అంటూ మండిప‌డుతున్నారు. అంతే కాదు..వైసీపీ మంత్రులు మాట్లాడిన దాంతో చూస్తే అయ్య‌న్న‌పాత్రుడు మాట్లాడింది చాలా త‌క్కువే అంటూ టీడీపీ కౌంట‌ర్లు ఇస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై అటు అధికార వైసీపీ, ఇటు ప్ర‌తిప‌క్ష టీడీపీలు ఒక‌రిపై ఒక‌రు కేసులు పెట్టుకున్నారు. ఈ వివాదానికి కార‌ణమైన మాజీ మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు మాత్రం తాను సీఎం జ‌గన్ తిట్ట‌లేద‌న్నారు. త‌న వ్యాఖ్య‌ల‌పై వైసీపీ నేతలు, కార్య‌క‌ర్త‌లు కావాల‌నే గొడ‌వ చేస్తున్నార‌ని ఆరోపించారు. జోగి ర‌మేష్ త్వ‌ర‌లో జ‌రిగే విస్త‌ర‌ణ‌లో మంత్రి ప‌ద‌వి కోస‌మే ఇలా చేశారంటూ టీడీపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

Next Story
Share it