Telugu Gateway
Andhra Pradesh

మూర్తి యాదవ్ కు లీగల్ నోటీసు పై వెనకడుగు!

మూర్తి యాదవ్ కు లీగల్ నోటీసు పై వెనకడుగు!
X

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా కొలువుతీరనున్న చంద్రబాబు ప్రభుత్వం సిఎస్ జవహర్ రెడ్డి భూదందాపై విచారణకు ఆదేశించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ఐఏఎస్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. జగన్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అసైన్ మెంట్ భూములను అమ్ముకునే వెసులుబాటు కలిపించాలని నిర్ణయం తీసుకునే ఆలోచన చేసిన వెంటనే జవహర్ రెడ్డి తన బినామీలతో అత్యంత కీలకమైన విశాఖపట్నంలో వందల ఎకరాలు బినామీల ద్వారా దక్కించుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించి పలు ఆధారాలతో సహా పత్రికల్లో కూడా వార్తలు వచ్చాయి. కొద్ది రోజుల క్రితం ఇదే అంశంపై జన సేన కు చెందిన కార్పొరేటర్ మూర్తి యాదవ్ సిఎస్ పై సంచలన ఆరోపణలు చేశారు. వీటిపై స్పందించిన జవహర్ రెడ్డి తనపై నిరాధార ఆరోపణలు చేసిన మూర్తి యాదవ్ కు లీగల్ నోటీసు ఇస్తానని పలు మార్లు అధికారికంగా మీడియా కు సమాచారం ఇచ్చారు. ఇది జరిగి చాలా రోజులు అయినా సరే ఇంతవరకు మూర్తి యాదవ్ కు లీగల్ నోటీసు లు ఇవ్వలేదు. దీంతో సిఎస్ జవహర్ రెడ్డి భూదందాపై అనుమానాలు మరింత బలోపేతం అయ్యాయి అనే చెప్పాలి. మూర్తి యాదవ్ కూడా ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా తాను జవహర్ రెడ్డి బినామీల వ్యవహారం నిరూపించటానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు కూడా.

లేదు అంటే ఆయన కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పటానికి సిద్ధం అన్నారు. అయినా సరే జవహర్ రెడ్డి ఇంతవరకు లీగల్ నోటీసు ల విషయంలో మౌనాన్ని ఆశ్రయించటంతో ఆయన భూదందాపై అనుమానాలు మరింత బలపడ్డాయి. ఇప్పుడు కొత్తగా కొలువుతీర నున్న చంద్ర బాబు సర్కారు కూడా జవహర్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. అందుకే ఆయన్ను సెలవుపై వెళ్ళమని ఆదేశించింది. సిఎస్ గా ఉండి..వైసీపీ కి కొమ్ముకాసినట్లు టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే అటు సిఎస్ జవహర్ రెడ్డి తో పాటు వైజాగ్ లోనే గుంటూరు జిల్లాకు చెందిన ఒక మంత్రి, మరో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ లు చేసిన అసైన్ మెంట్ భూముల దందాపై కూడా విచారణకు ఆదేశించే అవకాశం ఉంది అని చెపుతున్నారు. ఒక్క భూముల విషయంలోనే కాకుండా జవహర్ రెడ్డి కుటుంబ సభ్యులపై అక్రమ మైనింగ్ కు సంబంధించి కూడా టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వం మారటంతో గత ప్రభుత్వంతో అంటకాగి..అక్రమాలకు పాల్పడిన వాళ్లకు చుక్కలు చూపించటానికి రంగం సిద్ధం అవుతోంది. రాబోయే రోజుల్లో అధికారులకు సంబదించిన ఎన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో వేచిచూడాల్సిందే.

Next Story
Share it