స్కాములపై చర్యలు వదిలేసి అన్నీ సెటిల్మెంట్స్ !

టీడీపీ...వైసీపీ నీకు ఇది...నాకు అది మోడల్
దసపల్లా డీల్ లో వైజాగ్ వైసీపీ నేతలకూ వాటాలు!
అందుకే ఇప్పుడు అంతా మౌనం
వైసీపీ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది. వ్యవస్థలను నాశనం చేసింది. కూటమి వస్తే తప్ప రాష్ట్రం తిరిగి గాడినపడదు. ఇది ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన నాయకులు చెప్పిన మాటలు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో చోటుచేసుకున్న పలు కీలక స్కాములను అధికార కూటమి కప్పెట్టి ..ఏకంగా వైసీపీ వాళ్ళతో సెటిల్మెంట్స్ చేసుకుంటున్న తీరు చూసి ఇప్పుడు టీడీపీ నేతలు కూడా అవాక్కు అవుతున్నారు. ఎన్నికలకు ముందు చెప్పిన దానికి భిన్నంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అధికార వర్గాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వంలో అప్పటి సిఎస్ జవహర్ రెడ్డి తాను ఉన్న పొజిషన్ తో వైసీపీ సర్కారు తీసుకోబోయే నిర్ణయం తెలుసుకుని వైజాగ్ లోని అత్యంత కీలకమైన ఆనందపురం, పద్మనాభపురం మండలాల్లో బినామీలతో వందల ఎకరాల భూములు కొనుగోలు చేసినట్లు బహిర్గతం అయింది.
మీడియా లో కూడా దీనిపై మీడియా లో కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని వైజాగ్ కు చెందిన జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ కూడా అప్పటిలో మీడియా సమావేశం పెట్టి మరీ వెల్లడించారు. మూర్తియాదవ్ కు లీగల్ నోటీసులు ఇస్తానని హెచ్చరించిన జవహర్ రెడ్డి ఆ తర్వాత మౌనంగా ఉండిపోవడంతో ఈ స్కాం నిజం అని తేలిపోయింది. అసైన్మెంట్ భూములను అమ్ముకోవటానికి వీలుగా గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీన్ని అడ్డంపెట్టుకుని అప్పటి సిఎస్ జవహర్ రెడ్డి తో పాటు వైసీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు పెద్ద ఎత్తున మీడియా లో వార్తలు వచ్చాయి. అయినా సరే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయంపై చర్యలు తీసుకోవటం వదిలేసి కిమ్ అండ్ టీం తో ఒక కీలక మంత్రి వ్యవహారాన్ని సెటిల్ చేసుకున్నారు అని...అందులో భాగంగా వీళ్లకు వందల కోట్ల రూపాయల మేర ప్రయోజనం కలిగినట్లు టీడీపీ నేతలే చెపుతున్నారు. అందుకే ఈ కేసు అలా అటకెక్కిపోయింది. ఇది ఒక సెటిల్మెంట్ అయితే ఇప్పుడు లేటెస్ట్ గా దసపల్లా ల్యాండ్స్ విషయంలో కూడా అదే జరిగింది.
దీంతో కూటమి సర్కారు పలు విషయాల్లో వైసీపీతో కుమ్మక్కు అయినట్లు బలంగా ప్రజల్లోకి వెళుతుంది అని...ఇది అంతిమగా వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది అనే భయం కొంత మంది టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. దసపల్లా భూముల విషయంలో అసలైన హక్కుదారుల కంటే ఇప్పుడు అటు వైసీపీకి చెందిన డెవలపర్లు ....వాళ్లకు సహకరిస్తున్న కూటమి నేతలే ఎక్కువ లబ్ధిపొందుతున్నారు అంటే వీళ్ళ బంధం ఎలా ఉందో అర్ధం అవుతుంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వైసీపీ కీలక నేతలకు సన్నిహితులైన వాళ్ళ దగ్గరే ఇప్పుడు ఈ భూములు ఉన్నాయి. వాళ్లకు వేల కోట్ల రూపాయల ప్రయోజనం కలిగేలా దసపల్లా భూముల్లో వంద అడుగుల రోడ్ కు ఓకే చేయటంతో పాటు వేల కోట్ల రూపాయల టీడీఆర్ బాండ్స్ కూడా దక్కేలా ప్లాన్స్ సిద్ధం చేశారు. టీడీపీ ప్రభుత్వంలో ఇదే అంశంపై పెద్ద ఎత్తున విమర్శలు చేసిన వైసీపీ మాజీ మంత్రులు...వైసీపీ నేతలు కూడా ఇప్పుడు ఎవరి వాటాలు వాళ్లకు రావటంతో మౌనంగా ఉంటున్నారు అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
పవన్ కు ఇవేమి తెలియవా...తెలిసినా మౌనంగా ఉంటున్నారా?!
జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వైజాగ్ కేంద్రంగా సాగుతున్న వ్యవహారాలు ఏమి తెలియవా?. అన్నీ తెలిసే మౌనంగా ఉంటున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. గత ప్రభుత్వంలో మాజీ సిఎస్ జవహర్ రెడ్డి భూ అక్రమాలను వెలుగులోకి తెచ్చింది మీడియాతో పాటు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవే. అప్పటిలో ఇదే అంశంపై జనసేన నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు మాత్రం చాలా కన్వెనెంట్ గా ఈ విషయాన్ని మర్చిపోయారు. మరో వైపు దసపల్లా భూముల విషయంలో ఇంత జరుగుతున్నా కూడా జనసేన నేతలు కానీ..ఉప ముఖ్యమంత్రి గా ఉన్న పవన్ కళ్యాణ్ కానీ ఈ విషయాన్ని అసలు ఎక్కడా ప్రస్తావించటం లేదు.
దీంతో జనసేన తీరుపై కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అధికారంలో లేనప్పుడు తనకు అన్నీ విషయాలు తన నెట్ వర్క్ ద్వారా తెలిసేవి అని ప్రకటించిన పవన్ కళ్యాణ్ కు...ఇప్పుడు అధికారంలో ఉండి..ఉప ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ప్రభుత్వంలో జరుగుతున్న విషయాలు తనకు తెలియవు అంటే ఎవరైనా నమ్ముతారా అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే అందరూ కలిసే గత వైసీపీ స్కాం లను కాపాడుతూ అందరూ పెద్ద ఎత్తున ప్రయోజనం పొందుతున్నట్లు కనిపిస్తోంది అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.



