Telugu Gateway
Andhra Pradesh

పొత్తుల బంతిని బీజేపీ కోర్టులోకి నెట్టిన జనసేన!

పొత్తుల బంతిని బీజేపీ కోర్టులోకి నెట్టిన జనసేన!
X

జనసేన ఒక విషయంలో మాత్రం చాలా క్లారిటీ తో వ్యవహరిస్తోంది. అందులో ఒకటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే అంశం ఒకటి...మరొకటి వైసీపీ విముక్త ఆంధ్ర ప్రదేశ్. ప్రస్తుతానికి ఆంధ్ర ప్రదేశ్ లో జనసేన, బీజేపీ లు మిత్రపక్షాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ కూటమిలోకి టీడీపీ ని కూడా జనసేన కోరుకుంటోంది. ఇది బీజేపీ కి ఇష్టం లేని వ్యవహారంగా ఉంది. కొద్ది రోజులు క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రిపబ్లిక్ టీవీ తో మాట్లాడుతూ ప్రధాని మోడీ కి విజన్ ఉంది అని..అయన అభివృద్ధి విధానాలకు తాను ఎప్పడు వ్యతిరేకం కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా శనివారం నాడు హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గంటకు పైగానే భేటీ అయి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ భేటీపై జనసేన పీఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ అధికారికంగా కూడా స్పందించారు. "వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు అత్యుత్తమ ప్రత్యామ్నాయం కోసం జనసేన పార్టీ ప్రయత్నం చేస్తుంది. ప్రజలకు మేలు జరిగే పాలనలో అభివృద్ధి, సంక్షేమం రెండు సమపాళ్లలో అందించేందుకు జనసేన పార్టీ కట్టుబడి ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు చీలనీయబోమని, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పని చేస్తామని చెప్పారు. దానిలో భాగంగానే రాజకీయ భేటీలు ఉంటాయి. ఇవి భవిష్యత్తులోనూ జరుగుతాయి. ఒక ప్రణాళిక, వ్యూహంతో అభివృద్ధి పంథాలో రాష్ట్రాన్ని ముందుకు నడిపించేలా మా అడుగులు ఉంటాయి. భారతీయ జనతా పార్టీ మా మిత్రపక్షం. కచ్చితంగా రాజకీయంగా దానిని పాటిస్తూ ముందుకు వెళ్తాం అంటూ వెల్లడించారు. అంతా బాగానే ఉంది కానీ టీడీపీ, జనసేన లు కోరుకునే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కు బీజేపీ ఎంత మేరకు సహకరిస్తుంది అన్నదే ఇప్పుడు అత్యంత కీలకం.

ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ పొత్తుల బంతిని బీజేపీ కోర్టు లోకి నెట్టేసినట్లు కనిపిస్తోంది. వైసీపీ ని ఓడించాలి అనుకుంటే జనసేన తో ...టీడీపీ తో బీజేపీ కలిసి రావాలి అనే డిమాండ్ ను అనధికారికంగా ఆ పార్టీ ముందు పెట్టినట్లు అయింది అనే చర్చ సాగుతోంది. బీజేపీ ఈ విషయంలో ఏ మేరకు స్పందిస్తుంది అన్నదే ఇప్పుడు అత్యంత కీలకం కాబోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ తో తాము కొనసాగాలంటే వైసీపీ ని ఓడించటానికి ఆ పార్టీ కూడా ముందుకు రావాల్సిందే అనే షరతు పెట్టినట్లు కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది. లేదంటే బీజేపీ నుంచి దూరం జరగటానికి జనసేన కు మార్గం మరింత సుగమం అవుతుంది. ఇప్పటికే జనసేన, బీజేపీ ల మధ్య గ్యాప్ చాలా స్పష్టంగా ఉంది. పవన్ కళ్యాణ్, టీడీపీ కోరుకున్నట్లు బీజేపీ ఈ కూటమిలో చేరకపోతే సహజంగానే అది అధికార వైసీపీ కి అనుకూలంగా ఉన్నట్లు స్పష్టం అవుతుంది. స్వయంగా బీజేపీ నేతలు కూడా ప్రజల్లో బీజేపీ, వైసీపీ కలిసి ఉన్నాయనే భావనతో ఉన్నారనే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇది అంతా చూస్తుంటే మొత్తానికి ఏపీలో పొత్తుల రాజకీయాలు రాబోయో రోజుల్లో మరింత రసకందాయంలో పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ అధికార వైసీపీ పై చార్జిషీట్లు వేయటానికి రెడీ అవుతోంది. మొత్తంగా బీజేపీ వైసీపీ విషయంలో ఎన్నికలనాటికి ఎలాంటి స్టాండ్ చూపిస్తుంది అన్నదే అసలు ఆ పార్టీ విధానం అన్నది బయటపడుతుంది అని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Next Story
Share it