బీజేపీ గేమ్ ను గమనించే జన సేన నిర్ణయం తీసుకుందా?!

బీజేపీ వైసీపీ విషయంలో గేమ్ ఆడుతుంది అని గ్రహించే పవన్ తన నిర్ణయం తాను తీసుకున్నారు అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.అయితే ఆ విషయం నేరుగా చెప్పకుండా తమతో బీజేపీ వస్తే మంచిది అని తాము కోరుకుంటున్నాం అని..చంద్రబాబు అరెస్ట్ లో బీజేపీ పాత్ర లేదు అని ప్రకటించారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇక నుంచి ఆంధ్ర ప్రదేశ్ లో ఉమ్మడి కార్యాచరణ తో ముందుకు వెళతామని పవన్ కళ్యాణ్ తెలిపారు. పవన్ కళ్యాణ్ తాజా ప్రకటనతో ఇక నిర్ణయం తీసుకోవాల్సింది బీజేపీ మాత్రమే అని తేలిపోయింది. బీజేపీ నాయకులు గత కొంతకాలంగా వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలిసి ముందుకు సాగుతాయి అని ప్రకటిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో పవన్ తన వైఖరిని కుండ బద్దలు కొట్టినట్లు తేల్చటంతో బీజేపీ ఇరకాటంలో పడినట్లు అయింది. మరి జనసేన తో బీజేపీ పొత్తు తెంచుకుంటుందా...లేక తర్వాత ఈ కూటమిలో చేరుతుందా అన్నది ఆసక్తికర పరిణామం కానుంది. లేదు బీజేపీ ఒంటరిగా ముందుకు సాగాలని నిర్ణయం తీసుకుంటే మాత్రం ఇప్పటికే ప్రచారంలో ఉన్నట్లు అధికార వైసీపీ, బీజేపీ ల మధ్య రహస్య స్నేహం ఉంది అనే విషయం మరింత బలోపేతం అవుతుంది అని చెపుతున్నారు. రాజకీయంగా అది బీజేపీకి. అటు వైసీపీ కి కూడా ఎంతో కొంత నష్టం కలిగించే అంశంగా మారుతుంది అని భావిస్తున్నారు.