గెలిచినపుడు కారు లేదు...ఏడాది కాకముందే ఐదు కోట్ల ఇల్లు!

విలువలతో కూడిన రాజకీయం చేస్తాం . జనసేన అధినేత , ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఆ పార్టీ నేతలు చెప్పే మాట ఇది. పవన్ కళ్యాణ్ కూడా మాటల విషయంలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఏ మాత్రం తీసిపోకుండా చెపుతారు. కానీ వాస్తవంలో మాత్రం పరిస్థితి వేరేగా ఉంటుంది. ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చి ఇంకా నిండా ఏడాది కూడా కాలేదు. కానీ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో చెప్పే ఉదంతం ఇది. మొన్నటి ఎన్నికల్లో జనసేన తరపున ఏలూరు జిల్లా పోలవరం నుంచి చిర్రి బాలరాజు కూటమి తరపున పోటీ చేసి విజయం సాధించారు. గిరిజన నియోజకవర్గం నుంచి గెలిచిన ఈ ఎమ్మెల్యేకు తొలుత కారు కూడా లేకపోవటంతో సొంత పార్టీ అభిమానులే ఆయన కు డౌన్ పే మెంట్ కట్టి కారు కొనిచ్చినట్లు మీడియా లో వార్తలు వచ్చాయి. ఇది అప్పటి కాలం. కానీ ఇప్పుడు ఆయన రేంజ్ మారిపోయినట్లు ఆయన నియోజకవర్గంలోని ప్రజలు చెపుతున్న మాట.
అది ఎలా అంటే ఎన్నికల్లో గెలిచిన సమయంలో సొంత కారు కూడా లేని ఆయన ఇప్పుడు తన నియోజకవర్గంలోని జీలుగుమిల్లి మండలం బర్రెంకల్ పాడు గ్రామంలో ఏకంగా దగ్గర దగ్గర ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఇల్లు కడుతున్నారు. అది కూడా ఇప్పుడు తుది దశకు చేరుకుంది. అవే పైన కనిపించే ఫోటోలు కూడా . కేవలం పది నెలల కాలంలోనే సొంత ఇల్లు తో పాటు ఏకంగా క్యాంపు ఆఫీస్ కూడా నిర్మించి అందులో వీవీఐపీ, విఐపీ రూమ్ లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు చెపుతున్నారు . వచ్చే ఎన్నికల్లో ఎలాగూ తనకు సీటు రాదూ...వచ్చినా గెలిచే ఛాన్స్ ఉండదు అన్న చందంగా ఈ ఎమ్మెల్యే వ్యవ్యరిస్తున్నారు అని...అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే చందంగా వ్యవహరిస్తున్నట్లు చెపుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో చాలా మంది టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలపైనా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. పార్టీల అధినాయకత్వం ఎవరిపనుల్లో వాళ్ళు ఉంటే...ఎమ్మెల్యే లు కూడా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు అని ఒక మంత్రి వ్యాఖ్యానించారు.