Telugu Gateway
Andhra Pradesh

ఏపీ సర్కారు మొండి వైఖ‌రి వీడాలి

ఏపీ సర్కారు మొండి వైఖ‌రి వీడాలి
X

దేశంలోని ప‌లు రాష్ట్రాలు క‌రోనా కేసులు పెరుగుతున్న వేళ పాఠ‌శాల‌ల‌కు సెలవులు ప్ర‌క‌టించాయి. కానీ ఏపీ స‌ర్కారు మాత్రం సెల‌వుల పొడిగింపు ప్ర‌శ్నేలేద‌ని..తాము పాఠ‌శాల‌లు ప్రారంభిస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఈ నిర్ణ‌యం విద్యార్ధుల మేలు కోస‌మే తీసుకున్నామ‌ని చెబుతోంది. ఏపీ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని జ‌న‌సేన త‌ప్పుప‌ట్టింది. ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా మొండి వైఖ‌రిని వీడి, విద్యార్ధుల ఆరోగ్యాన్ని గ‌మ‌నంలోకి తీసుకుని నిర్ణ‌యం తీసుకోవాల‌ని జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ ఛైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ కోరారు. ఈ మేర‌కు ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 'విద్యాసంస్థలను కనీసం ఈ నెలాఖరు వరకూ మూసివేస్తేనే విద్యార్థులను ఈ వైరస్ బారి నుంచి కాపాడుకోగలం. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మాత్రం- కేసులు పెరిగితే చూద్దాం అని చెప్పడం ఆయన బాధ్యతారాహిత్యాన్ని తెలియచేస్తోంది. విద్యార్థుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం బాధ్యత లేదనే విషయం అర్థమవుతోంది. దేశంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే విద్యా సంస్థలను మూసివేసి ఆన్ లైన్ విధానంలో తరగతులు నిర్వహణపై మార్గదర్శకాలు ఇచ్చాయి. ఆ మాత్రం దూరదృష్టి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి లేకపోయింది. రోజుకి 4 వేలకుపైగా కొత్త కేసులు రాష్ట్రంలో నమోదవుతున్నాయి.

దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేట్ 16.28% నుంచి 19.65%కి పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్న విషయాన్ని విస్మరించవద్దు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను స్కూల్స్, కాలేజీలకు పంపించడం రిస్క్ అవుతుంది. ఏపీ విద్యాశాఖ మంత్రి- వ్యాక్సిన్లు ఇస్తున్నాం కాబట్టి స్కూల్స్ తెరుస్తాం అంటున్నారు. 15-18 సంవత్సరాల మధ్య పిల్లలకు వ్యాక్సిన్ మన రాష్ట్రం కంటే మహారాష్ట్రలో ఎక్కువ మందికి వేశారు. అక్కడే విద్యా సంస్థలను మూసివేశారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లోనూ వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఆయా రాష్ట్రాలు విద్యార్థుల క్షేమం కోసం సెలవులు పొడిగించాయి. ఎన్నో జాగ్రత్తలు తీసుకొనే వైద్య కళాశాలల్లోని విద్యార్థులే కోవిడ్ బారినపడుతున్నారు. మరి స్కూల్ పిల్లల పరిస్థితి ఏమిటి? ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలల్లోభౌతిక దూరం అమలు చేయడం లేదు. పాఠశాలల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచడం లేదు. అలాంటప్పుడు స్కూల్స్ తెరవడం సమంజసమా? ' అని ప్ర‌శ్నించారు.

Next Story
Share it