మున్సిపల్ ఎన్నికలు..ఎస్ఈసీ పునరాలోచించాలి
గత ఏడాది ఎక్కడ ఆగిపోయాయో అక్కడ నుంచే ఏపీలో మున్సిపల్ ఎన్నికలను ప్రారంభించేందుకు వీలుగా ఎస్ఈసీ షెడ్యూల్ విడుదల చేయటంపై రాజకీయ పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. తెలుగుదేశం తోపాటు కాంగ్రెస్, జనసేనలు కూడా ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నాయి. గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో నామినేషన్లు వేసే సమయంలో ఎన్నో అక్రమాలు, అవకతవకలు జరిగాయని పార్టీలు ఆరోపిస్తున్నాయి. దీనికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం నాడు ఓ ప్రకటన విడుదల చేశారు. 'మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నుంచే ప్రారంభిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించడం ప్రజాస్వామ్యయుతంగా లేదు. పార్టీ సింబల్ పరంగా జరుగుతున్న ఈ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పునః ప్రారంభించాలి. రాష్ట్ర ఎన్నికల సంఘం తన ప్రకటనపై మరోసారి పునరాలోచన చేయాలి.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా, అందరికి అవకాశం కల్పించే విధంగా న్యాయ నిపుణులతో చర్చించి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను తిరిగి ప్రారంభించాలి. సంవత్సరం క్రితం నామినేషన్ల ప్రక్రియ జరిగినప్పుడు అధికార పార్టీ అనేక దౌర్జన్యాలకు పాల్పడింది. ఇతర పార్టీల అభ్యర్థులను మభ్యపెట్టారు. ఓటర్లను ప్రలోభపెట్టారు. చాలా చోట్ల నామినేషన్లు వేయకుండా దౌర్జన్యాలకు పాల్పడ్డారు. మరికొన్ని చోట్ల నామినేషన్లు ఉపసంహరించుకోవాలని బెదిరించారు. వీటన్నింటిని మరచిపోయి ఆగిన చోట నుంచే మొదలుపెట్టాలని ప్రకటించడం సబబు కాదు. పంచాయతీ ఎన్నికల్లో మనం చూశాం. నామినేషన్ల ప్రక్రియలో జరిగిన అవకతవకలు, బెదిరింపులు వాటితోపాటు కోవిడ్ దృష్ట్యా ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని రాజకీయ పార్టీగా స్వాగతించాం. సుమారు ఈ ఏడాది కాలంలో అభ్యర్ధులను, ఓటర్లను అధికారపక్షం మభ్యపెట్టింది. ఆగిన చోట మళ్లీ ఎన్నికలు ప్రారంభించడం ప్రజాస్వామ్యబద్ధం కాదు.' అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.