Telugu Gateway
Andhra Pradesh

ఇది అవకాశవాదం కాదా!

ఇది అవకాశవాదం కాదా!
X

సహయం చేసిన వాడికి కృతజ్ఞత చెప్పాలా వద్దా అన్నది వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వాలను బట్టి ఉంటుంది. కృతజ్ఞత చెప్పకపోయినా కూడా ఏమీ కాదు. వాళ్ళ తీరు అంతేలే అని అనుకుని వదిలేస్తారు. కానీ అందుకు భిన్నంగా అవసరానికి ఉపయోగించుకుని...అవసరం తీరిన తర్వాత వాళ్ళను వదిలేసి మీ ఖర్మ అంటే వాళ్లనే పవన్ కళ్యాణ్, నాగ బాబు లు అంటారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో కూటమి పొత్తులో భాగంగా పిఠాపురం నియోజకవర్గం బరిలో నిలిచిచిన సంగతి తెలిసిందే. తొలుత ఈ సీటు వదులుకోవడానికి ససేమిరా అన్న మాజీ ఎమ్మెల్యే వర్మ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు పిలిచి మాట్లాడి గెలిచిన తర్వాత వచ్చే ఎమ్మెల్సీల్లో ఫస్ట్ ఛాన్స్ మీకే ఇస్తాను అని చెప్పి హామీ ఇచ్చి వర్మను శాంతింప చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో పవన్ కళ్యాణ్ ఏకంగా పిఠాపురంలో వర్మ ఇంటికి వెళ్లి నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం అని మీడియా సాక్షిగా...వీడియోల సాక్షిగా ప్రకటించారు.

ఒక్క వర్మ కాదు ..వర్మ కొడుకు కూడా తన కోసం బాగా పనిచేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కానీ సీన్ కట్ చేస్తే శుక్రవారం నాడు జనసేన జయకేతనం సభలో కొత్తగా ఎమ్మెల్సీ గా ఎన్నికైన నాగ బాబు పిఠాపురం వేదికగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలుపునకు తానే దోహదపడ్డాను అని ఎవరైనా అనుకుంటే అది వారి ఖర్మ అంటూ వ్యాఖ్యానించారు . పిఠాపురం గెలుపులో కీలకం పవన్ కళ్యాణ్, ఇక్కడి ఓటర్లు, జన సైనికులు మాత్రమే అని స్పష్టం చేశారు. నాగ బాబు వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేడిగా టీడీపీ క్యాడర్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జనసేన జయకేతనం సభ ఏర్పాట్లను దగ్గర ఉండి పర్యవేక్షించిన మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అని ఇక్కడ తాము ఎవరికీ చెక్ పెట్టాల్సిన అవసరం లేదు అంటూ కూడా కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.

Next Story
Share it