Telugu Gateway
Andhra Pradesh

వాళ్లిద్దరూ మరింత దగ్గరయ్యారు

వాళ్లిద్దరూ మరింత దగ్గరయ్యారు
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఇబ్బంది వస్తే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగమేఘాలమీద పరిగెడతారు... సంఘీభావం ప్రకటిస్తారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కి ఏమైనా ఇబ్బంది అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అలాగే చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వైజాగ్ లో పవన్ ను ఇబ్బంది పెట్టింది అని చంద్రబాబు విజయవాడ లో హోటల్ కు వెళ్లి పవన్ ను పరామర్శించారు. కుప్పం లో చంద్రబాబు కు జగన్ సర్కారు ఆటంకాలు కల్పించింది అని హైదరాబాద్ లో చంద్రబాబు నివాసానికి వెళ్లి కలిశారు పవన్ . ఈ రెండు సంఘటనలు చూసిన వాళ్ళు అంతా చంద్రబాబు, పవన్ మరింత దగ్గరయ్యారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని భావిస్తున్నారు. వీళ్లిద్దరు హైదరాబాద్ లో కలవటంతో వేడి, కాక తాడేపల్లి లో మొదలైంది. అలా వీళ్ళ సమావేశం ముగిసిందో లేదో జగన్ సర్కారులో మంత్రులు ఎటాక్ ప్రారంభించారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కాపాడుకునేందుకు అందరూ కలిసి సాగాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెపుతుంటే..జనసేన మాత్రం వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ఎప్పటినుంచో చెపుతూ వస్తోంది. ప్రజల దగ్గరకు ప్రతిపక్ష పార్టీలు వెళ్ళకూడదు అనేలా ప్రభుత్వం జీఓ తెచ్చింది అని పవన్ విమర్శించారు. అసలు టీడీపీ, జనసేన పార్టీలు కలుస్తానే క్లారిటీ లేక ముందే నుంచే అధికార వైసీపీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ, జనసేన కలవటం ఖాయం అనే అభిప్రాయం చాలా కాలం నుంచి ఉన్న విషయం తెలిసిందే. పొత్తుల పై మాట్లాడానికి ఇది సమయం కాదు అని..తమ వ్యూహాలు తమకు ఉన్నాయని ఇద్దరు నేతలు తెలిపారు. ఈ సారి అధికార వైసీపీ చిరంజీవిని కూడా వివాదంలోకి లాగింది. చిరంజీవి పార్టీ పెట్టి కాంగ్రెస్ లో కలిపారు..అలాగే పవన్ కళ్యాణ్ కూడా పార్టీ నడపలేకపోతే టీడీపీ లో కలపొచ్చు కదా అంటూ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. బీజేపీ తో కలిసి ఉంది..పవన్ ఇలా చంద్రబాబు తో సమావేశం కావటం ఏంటి అంటూ అంబటి ప్రశ్నించారు.

Next Story
Share it