టీడీపీ నాయకులు కూడా పోటీ పడలేరు
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగు దేశం అధినేత చంద్రబాబు కు పార్టీ నాయకులు, మంత్రులకు ర్యాంకింగ్స్ ఇవ్వటం అలవాటు. ఇది ఎప్పటి నుంచో ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ ర్యాంకింగ్ లు ఇచ్చారు. అక్కడితో ఆగలేదు. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ను అతలాకుతలం చేసిన వరదల సమయంలో ఎవరు బాగా పని చేశారో కూడా ర్యాంకింగ్స్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెపుతున్నాయి. వరద పనుల విషయంలో చంద్రబాబు కు ఫస్ట్ ర్యాంక్ వస్తే...జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి రెండవ ర్యాంక్, మంత్రి నారాయణకు మూడవ ర్యాంక్, నారా లోకేష్ కు నాల్గవ ర్యాంక్ ఇచ్చినట్లు టీడీపీ వర్గాలు చెపుతున్నాయి. మరి ఈ జాబితాలో జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్కడా అన్న ప్రశ్న ఉదయించకమానదు. కారణాలు ఏమైనా కూడా ఆయన మాత్రం వరదల సమయంలో బయటకు రాలేదు. కాకపోతే వరద బాధితులకు ఆర్థిక సాయం విషయంలో మాత్రం ఎవరూ చేయనంత చేశారు.
బుధవారం నాడు విజయవాడ లో జరిగిన ఎన్ డీఏ సమావేశంలో జనసేన అధినేత, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు చూసిన తర్వాత అటు టీడీపీ నేతలు, ఇటు కొంత మంది జనసేన నేతలు కూడా చంద్రబాబు ను పొగిడే పోటీ లో మాత్రం పవన్ కళ్యాణ్ కు ఫస్ట్ ప్లేస్ వస్తుంది అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే అంశంపై రెండు పార్టీల నాయకుల్లో కూడా హాట్ హాట్ చర్చ సాగుతోంది. వరదల వేళ చంద్రబాబు పాలనా దక్షత అమోఘం, అసలు క్యాబినెట్ సమావేశంలో కూడా ఇన్ని గంటలు ఎలా కూర్చుంటారు..ఆ ఎనర్జీ లెవెల్స్ వేరు అంటూ పవన్ కీర్తించిన విషయం తెలిసిందే. ఏ టీడీపీ నాయకుడు కూడా చంద్రబాబు ను పవన్ కళ్యాణ్ లాగా ఇంతలా పొగడరు అని ఒక జనసేన నేతే వ్యాఖ్యానించారు.
ఇద్దరి కీలక నేతల పరిస్థితి ఎలా ఉంది అంటే ఆయా జిల్లాల్లో, నియోజకవర్గాల్లో ఉండే నాయకులు..క్యాడర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నా కూడా వీళ్ళు మాత్రం అవేమి పట్టించుకోకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది అని టీడీపీ కి చెందిన సీనియర్ నేత ఒక వ్యాఖ్యానించారు. మరో కీలక విషయం ఏమిటి అంటే ప్రభుత్వంలో జరిగే వ్యవహారాల్లో ఏదీ కూడా పవన్ కళ్యాణ్ కు తెలియకుండా చేయటం లేదు అని..అంతా ఒక అండర్ స్టాండింగ్ ప్రకారమే జరుగుతుంది అని ఒక మంత్రి వ్యాఖ్యానించటం విశేషం. విద్యుత్ రంగంలో జరిగే గోల్ మాల్స్ తో పాటు ప్రతి విషయం కూడా పవన్ కళ్యాణ్ కు తెలుసు అని..అయినా కూడా ఆయన ఇవేమి పట్టించుకోకుండా మాట్లాడుతున్నారు అంటే ఆ ఒప్పందాల ‘విలువ’ ఏంటో చేసుకోవటం పెద్ద కష్టం కాదు అని ఒక ఆయన అభిప్రాయపడ్డారు.