Telugu Gateway
Andhra Pradesh

తిరుపతి అభ్యర్ధి ఎంపికకు ఉమ్మడి కమిటీ

తిరుపతి అభ్యర్ధి ఎంపికకు ఉమ్మడి కమిటీ
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం నాడు ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జె పీ నడ్డాతో సమావేశం అయ్యారు. ఈ బేటీలో ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఈ భేటీలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. నడ్డాతో భేటీ అనంతరం పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ లు మీడియాతో మాట్లాడారు. బిజెపి అధ్యక్షుడు నడ్డా ఆహ్వానం మేరకే తాము ఢిల్లీ వచ్చామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ సమావేశంలో ప్రధానంగా తిరుపతి ఉప ఎన్నిక గురించి ప్రత్యేకంగా మాట్లాడినట్లు చెప్పారు. దీనిపై ఓ కమిటీ వేస్తామని నడ్డా చెప్పారన్నారు. తిరుపతి ఉప ఎన్నికల బరిలో జనసేన అభ్యర్థి ఉంటారా? లేక బీజేపీ అభ్యర్థి ఉంటారా? అన్నది రెండ్రోజుల్లో తేలిపోతుందని పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. అమరావతి, పోలవరం అంశాలపై కూడా నడ్డాతో చర్చించినట్లు పవన్ తెలిపారు.

భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్‌లో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై కూడా చర్చించినట్లు చెప్పారు. అమరావతి రైతులకు బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ అవినీతి గురించి, దేవాలయాలపై దాడులు. లా అండ్ ఆర్డర్ గురించి కూడా నడ్డాతో చర్చించినట్లు పవన్‌కల్యాణ్ వెల్లడించారు. అంతకు ముందు నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తాము ఒక సీటు కోసమో..ఇతర రాజకీయ ప్రయోజనాల కోసమే ఢిల్లీకి రాలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత పూర్తిగా కేంద్రానిదే అని..రాష్ట్రం నుంచి కొంత సమాచారం కావాల్సి అది అడుగుతున్నారని తెలిపారు. ప్రాజెక్టు రాష్ట్రానికి ఉపయోగపడాలి కానీ..కొంత మంది వ్యక్తులకు కాదన్నారు. రెండు రాష్ట్రాల్లో బిజెపి, జనసేనలు కలసి వెళ్ళటానికి వీలుగా రోడ్ మ్యాప్ ఖరారు అంశంపై చర్చించినట్లు తెలిపారు.

Next Story
Share it