Telugu Gateway
Andhra Pradesh

జనసేనలో కాకరేపుతున్న రాజ్య సభ అంశం !

జనసేనలో కాకరేపుతున్న రాజ్య సభ అంశం !
X

రాజ్య సభ ఎన్నికలు జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు సవాల్ గా మారనున్నాయి. పార్టీకి దక్కే ఫస్ట్ రాజ్యసభ సీటు ఎవరికి కేటాయిస్తారు అన్నది ఇప్పుడు ఆ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. జూన్ లో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ సీట్లకు సంబంధించి షెడ్యూలు కూడా వెలువడింది. ఖాళీ కానున్న నాలుగు స్థానాలు అన్నీ కూడా కూటమికే దక్కనున్నాయి. ఇందులో మూడు సీట్లు వైసీపీ వి అయితే...ఒక సీటు తెలుగు దేశం పార్టీ సభ్యుడిది. అసెంబ్లీలో వైసీపీ బలం పదకొండు మాత్రమే కావటంతో ఆ పార్టీ కి ఒక్క సీటు వచ్చే ఛాన్స్ కూడా లేదు. ఖాళీ కానున్న నాలుగు సీట్లలో ఒక సీటు జనసేనకు కేటాయించి....మిగిలిన మూడు సీట్లను తెలుగు దేశం పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపే ఆలోచనలో ఉంది. ఈ సారి బీజేపీ కి సీటు ఇవ్వలేము అని చంద్రబాబు నాయుడు బీజేపీ కి చెప్పినట్లు మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. అయితే జనసేన కు దక్కే ఒక్క సీటు ను వివాదాస్పద పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ కు ఇస్తారు అనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఇప్పటికే దీనిపై పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నట్లు కూడా చెపుతున్నారు.

అయితే ఇక్కడ కీలక విషయం ఏమిటి అంటే అసలు పార్టీలో సభ్యత్వం లేని లింగమనేని రమేష్ కు రాజ్య సభ సీటు ఎలా ఇస్తారు అనే చర్చ జనసేన నాయకుల్లో సాగుతోంది. ఇప్పుడు కొంత మంది నాయకులు కొత్త వాదనను కూడా కూడా తెరమీదకు తెచ్చారు. అదేంటి అంటే ప్రచారం జరుగుతున్నట్లు లింగమనేని రమేష్ కు జనసేన నుంచి సీటు ఇస్తే ఆయన రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థి అవుతారు తప్ప...జనసేన అభ్యర్థి కారు అని కొంత నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అది ఎలా అంటే లింగమనేని రమేష్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. అంతే కాదు రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ఏపీకి షిఫ్ట్ అయినప్పటి నుంచి కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ లో ఉంటున్న విషయం తెలిసిందే. ఇది అక్రమ కట్టడం అంటూ అప్పటిలో దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు. ఈ గెస్ట్ హౌస్ వ్యవహారంపై పెద్ద దుమారమే సాగింది. ఇప్పటికీ సీఎం చంద్రబాబు అదే గెస్ట్ హౌస్ లో ఉన్నారు కూడా. అంతే కాదు తన సినిమా షూటింగ్ ల కోసం లింగమనేని రమేష్ తన స్థలం ఇచ్చారు అని ఒక సారి పవన్ కళ్యాణ్ బహిరంగంగానే చెప్పారు.

దీంతో పాటు జనసేన పార్టీ కార్యాలయానికి కూడా ఆయనే తక్కువ రేట్ కు భూమి ఇచ్చారు అనే ప్రచారం జనసేన నాయకుల్లో ఉంది. ఇవి అన్నీ చూస్తే లింగమనేని రమేష్ ను జనసేన అభ్యర్థి కంటే ఉమ్మడి అబ్యర్ధిగానే పరిగణించే అవకాశం అని...ఇది పార్టీ శ్రేణులకు ఏ మాత్రం మంచి సంకేతం పంపదు అనే అభిప్రాయం పార్టీ నాయకుల్లో ఉంది. లింగమనేని రమేష్ తో పాటు ఇప్పుడు జనసేన రాజ్యసభ రేస్ లో మరో పారిశ్రామికవేత్త బండారు నరసింహారావు కూడా రంగంలోకి దిగారు. ఆయన కూడా పవన్ కళ్యాణ్ కు సన్నిహితుడిగా ప్రచారం ఉంది. గతంలో లోక్ సభ బరిలో నిలిచేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అందుకే ఈ సారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వీళ్ళిద్దరూ కాకుండా టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాత ఒకరు కూడా రేస్ లో ఉన్నట్లు జనసేన వర్గాలు చెపుతున్నాయి. వివాదాలు తప్పించుకోవాలంటే పవన్ ఆ నిర్మాత వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది అన్నది ఆ పార్టీ నాయకుల అంచనా.

టీడీపీ నాయకుల లిస్ట్ పెద్దదే!

రాజ్య సభ సీటు అశిస్తున్న వాళ్ళ విషయానికి వస్తే టీడీపీ లో జాబితా చాలా పెద్దగానే ఉంది. అయితే బీజేపీ కచ్చితంగా తమకు మరో సీటు కావాలని కోరుతుందా...లేక ఈ సారికి మూడు సీట్లు టీడీపీ కి వదిలేస్తుందా అన్న అంశంపై క్లారిటీ రావాలంటే కొంత సమయం పడుతుంది. ఈ సారి సీటు లేదు అని చంద్రబాబు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కు చెప్పినట్లు మీడియా లో వార్తలు వచ్చినా కూడా ప్రధాని నరేంద్ర మోడీ, లేదా అమిత్ షా లు రంగంలోకి దిగి తమకు సీటు కావాలటంటే చంద్రబాబు నో చెప్పే పరిస్థితిలో లేరు అన్నది టీడీపీ నాయకులు చెపుతున్న మాట. టీడీపీకి దక్కే సీట్లలో ఒకటి మాత్రం మంత్రి నారా లోకేష్ సన్నిహితుడు సానా సతీష్ కు వెళ్ళటం పక్కా అన్నది ఎక్కువ మంది చెపుతున్న మాట.

మిగిలిన రెండు సీట్ల కోసం ఏకంగా అరుగురికిపైగా సీరియస్ పోటీ దారులు ఉన్నారు. ఇందులో గల్లా జయదేవ్ తో పాటు భాష్యం రామకృష్ణ, కిలారి రాజేష్, కంభంపాటి రామ్మోహన్ రావు, ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి మాజీ చైర్మన్ ఎం ఏ షరీఫ్ లు ఉన్నారు. అయితే నారా లోకేష్ సన్నిహితుడు సానా సతీష్ కు రెన్యూవల్ ఉన్నందున మరో సన్నిహితుడు కిలారి రాజేష్ కు మాత్రం ఈ సారి ఛాన్స్ ఉండకపోవచ్చు అన్నది ఎక్కువ మంది నేతలు చెపుతున్న మాట. వీళ్ళే కాకుండా రాయలసీమ ప్రాంతం నుంచి ఒక బీసీ లీడర్ ఎంపిక సర్ప్రైజ్ గా ఉందొచ్చు అని టీడీపీ నేతల్లో ప్రచారం జరుగుతోంది. సామాజిక సమీకరణాల ఆధారంగా కూటమి సర్కారు రాజ్య సభ అభ్యర్థుల విషయంలో నిర్ణయం తీసుకుంటుంది అని ఒక సీనియర్ నేత వెల్లడించారు.

Next Story
Share it