Telugu Gateway
Andhra Pradesh

పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం !

పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం !
X

కడప జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం. వై ఎస్ ఫ్యామిలీ నుంచి మరొకరు రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నారు. వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పెద్ద కుమార్తె హర్షా రెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అంతే కాదు ఆమె తన తొలి ప్రయత్నంలోనే కడప లోక్ సభ బరిలో నిలవబోతున్నట్లు చెపుతున్నారు. 2029 లో జరిగే ఎన్నికల్లో వైసీపీ తరపున ఆమె బరిలో నిలిచే అవకాశం ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా కడప లోక్ సభ నియోజకవర్గం వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి కంచుకోటగా ఉన్న సంగతి తెలిసిందే. గతంలో జగన్ మోహన్ రెడ్డి కూడా కడప ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి ఎంపీగా వై ఎస్ అవినాష్ రెడ్డి ఉన్న విషయం తెలిసిందే. కడప లోక్ సభ సీటు జగన్ మోహన్ రెడ్డి కుమార్తెకు కేటాయించటం ఖాయం అని...ఈ మేరకు ఇప్పటికే నిర్ణయం అయిపోయినట్లు సమాచారం.

తన కుమార్తెను కడప లోక్ సభ బరిలో దింపేందుకు వీలుగా జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్లు చెపుతున్నారు. అంతే కాదు జగన్ మోహన్ రెడ్డి తన ఇద్దరు కుమార్తెలకు వ్యాపార బాధ్యతలు అప్పగించే పని కూడా మొదలుపెట్టారు అని వైసీపీ వర్గాలు చెపుతున్నాయి. రాజకీయాల్లోకి ప్రవేశించనున్న పెద్ద కుమార్తె హర్షా రెడ్డి గత కొంత కాలంగా సాక్షి మీడియా వ్యవహారాలను కూడా పర్యవేక్షిస్తున్నట్లు పార్టీ నాయకులు చెపుతున్నారు. హర్షా రెడ్డి పారిస్ లోని ప్రతిష్టాత్మక ఇన్ సీడ్ బిజినెస్ స్కూల్ లో మాస్టర్స్ పూర్తి చేశారు. హర్షా రెడ్డి కి కడప లోక్ సభ సీటు కేటాయిస్తే ప్రస్తుత కడప ఎంపీ అవినాష్ రెడ్డికి మరో లోక్ సభ సీటు ఇస్తారా..లేక ఆయన్ను అసెంబ్లీ బరిలో నిలుపుతారా అన్న అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది అని చెపుతున్నారు.

Next Story
Share it