అసెంబ్లీకి జగన్ ఇస్తున్న విలువ ఇదేనా?

ప్రెస్ మీట్లతో పోరాటం అన్నప్పుడు ఈ వ్యవస్థ ఎందుకు?
అవాక్కు అవుతున్న వైసీపీ నేతలు
వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా కంటే కూడా ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం ఎక్కువ పోరాడుతున్నట్లు ఉంది?. ప్రతిపక్షంలో ఉండగా కేంద్రం మెడలు వంచి అయినా ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పిన ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే మన ఖర్మ బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చింది అంటూ చేతులు ఎత్తేశారు. ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న ప్రధాన పార్టీలు అన్ని అంటే టీడీపీ, వైసీపీ, జనసేనలు కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు డ్రామాలు వేసిన వాళ్లే. కానీ అసెంబ్లీకి హాజరు విషయంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు సొంత పార్టీ నాయకులకు కూడా ఏ మాత్రం మింగుడుపడటం లేదు. రాబోయే రోజుల్లో ఇది రాజకీయంగా తమను తీవ్ర ఇరకాటంలోకి నెట్టడం ఖాయం అనే భయం ఆ పార్టీ నేతల్లో ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుతీరి రెండేళ్లు దాటింది.
ఈ రెండేళ్లలో గవర్నర్ ప్రసంగం ఉన్న సమయంలో అసెంబ్లీకి అలా వచ్చి ఇలా వెళ్ళిపోవటం తప్ప...జగన్ మోహన్ రెడ్డి తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ కూడా సభకు హాజరు కావటం లేదు. ఆగస్ట్ 17 నుంచి మొదలు కానున్న అసెంబ్లీ సమావేశాలకు కూడా దూరంగా ఉండాలి వైసీపీ నిర్ణయించింది. కానీ మండలి లో మాత్రం ఎప్పటిలాగే వైసీపీ ఎమ్మెల్సీలు హాజరు అవుతారంట. ఈ లెక్కన చూస్తుంటే జగన్ మోహన్ రెడ్డి ఈ ఐదేళ్లు కూడా తన ప్రతిపక్ష హోదా కోసం ఇలాగే పోరాటం కొనసాగిస్తారా అన్న చర్చ సాగుతోంది. ప్రెస్ మీట్ల తో ప్రభుత్వం మీద పోరాటం చేసేటట్లు అయితే...ఇక ఎమ్మెల్యేలు ఎందుకు...అసెంబ్లీ ఎందుకో అర్ధం కావటం లేదు అని వైసీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.
జగన్ మోహన్ రెడ్డి తీరు అసెంబ్లీ వ్యవస్థను కూడా అవమానించేలా ఉంది అని..ఇది రాజకీయంగా ఏ మాత్రం మంచిది కాదు అని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అసలు సభకు హాజరు కాకుండా ప్రతిపక్ష హోదా లేకపోతే తమకు సమయం ఇవ్వరు అనే ఒకే ఒక కారణం చెప్పి జగన్ రెండేళ్లు గా సభా కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. జగన్ ఒక్కరే దూరంగా ఉండటం కాదు...వైసీపీ నుంచి ఎన్నికైన మిగిలిన పది మంది సభ్యులు కూడా సభకు హాజరు కాకుండా చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. దీంతో ఆ ఎమ్మెల్యేలు తమ అసెంబ్లీ నియోజకవర్గంలో సమస్యల గురించి సభలో ప్రస్తావించే అవకాశం కూడా లేకుండా పోతుంది వాళ్లకు. అయినా సరే జగన్ మోహన్ రెడ్డి మాత్రం ప్రతిపక్ష హోదా లేకుండా అసెంబ్లీకి పోవటం వేస్ట్ అంటూ అదే మాట చెపుతూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు అసెంబ్లీకే వెళ్ళని వాళ్లకు ఓట్లు వేయటం ఎందుకు దండగ అనుకుంటే తమ పరిస్థితి ఏంటో అర్ధం కావటం లేదు అని వైసీపీ ఎమ్మెల్యే లు వాపోతున్నారు.



