Telugu Gateway
Andhra Pradesh

ఐదేళ్లు వదిలేసి ఇప్పుడు లేచిన జగన్

ఐదేళ్లు వదిలేసి ఇప్పుడు లేచిన జగన్
X

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి సీఎం పదవి పోయిన వెంటనే ప్రత్యేక హోదా అంశం గుర్తు వచ్చింది. కేంద్రంలోని మోడీ సర్కారు గత ఐదేళ్ల కాలంలో అడిగిన ప్రతి సారి ఎలాంటి షరతులు లేకుండా... ప్రతిసారి బేషరతుగా మద్దతు ఇస్తూ పోయింది వైసీపీ. అంతే కాదు...రాష్ట్రపతి ఎన్నిక విషయంలోనూ అలాగే చేశారు. ఇదే జగన్ 2019 ఎన్నికల్లో తమకు 25 కు 25 ఎంపీ సీట్లు ఇవ్వండి..ప్రత్యేక హోదా ఎలా రాదో చూస్తా..కేంద్రం మెడలు వంచి సాధిస్తా అంటూ ప్రకటనలు చేశారు. ప్రజలు ఏకంగా 22 ఎంపీలు గెలిపించారు. కానీ జగన్ తాను అధికారంలో ఉన్న ఐదేళ్లు హ్యాండ్సప్ అన్నారే తప్ప చేసింది ఏమి లేదు. పైగా అడగటం తప్ప ఏమి చేయలేము అంటూ బహిరంగంగానే ప్రకటించారు. పోనీ మొన్నటి ఎన్నికల్లో జగన్ ఏమైనా తన ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక హోదా ఊసు ఎత్తారా అంటే ఏమీ లేదు. ఎందుకంటే ఐదేళ్లు తాను ఏమి చేయలేదు కాబట్టి...అది తనకు నష్టం చేస్తుంది కాబట్టి. కానీ పదవి నుంచి దిగిపోయిన వెంటనే జగన్ కు ప్రత్యేక హోదా గుర్తుకురావటం మాత్రం విశేషం అనే చెప్పాలి. కేంద్రంలో బీజేపీ కి 240 సీట్లు మాత్రమే వచ్చిన సమయంలో...రాష్ట్రంలో వీళ్లకు మంచి నంబర్లు వచ్చిన పరిస్థితుల్లో ఎన్డీయేలో చక్రం తిప్పే ఛాన్స్ వచ్చినా కూడా ప్రత్యేక హోదా అడక్కపోవటం చంద్రబాబు చేసిన పాపం అంటూ జగన్ వ్యాఖ్యానించారు.

ఈ పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా అడిగితెచ్చుకోకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా చంద్రబాబు ను క్షమించడు. ఈ పాపాలు పండే దాకా మనం కాస్త గట్టిగా నిలబడగలిగితే, ముందుకు తీసుకు వెళ్లగలిగితే వంద పాపాలు త్వరలోనే అయిపోతాయి. కష్టాలు రావటం అన్నది సర్వ సహజం. వాటిని ఎదుర్కొని నిలబడటం అన్నది మన చేతుల్లో ఉన్న అంశం అంటూ వ్యాఖ్యానించారు ఎమ్మెల్సీ లతో నిర్వహించిన సమావేశంలో జగన్ ఈ మాటలు అన్నారు. అటు జగన్ కానీ..ఇటు చంద్రబాబు కానీ ఈ ఎన్నికల్లో ప్రత్యేక హోదా విషయాన్ని పెద్దగా ప్రస్తావించలేదు అనే చెప్పాలి. జగన్ చెపుతున్నట్లు చంద్రబాబు మోడీకి మద్దతు ఇచ్చే విషయంలో ఒక ప్రత్యేక హోదా అంశంలోనే కాదు...జగన్ ఐదేళ్లు పక్కనపడేసి అమరావతి విషయంలో కూడా ఇప్పటివరకు మోడీ ని ప్రత్యేక సాయం కోరినట్లు లేదు. విశాఖపట్నం సభలో ప్రధాని మోడీతో తన బంధం రాజకీయాలకు అతీతం అయినది అని చెప్పిన జగన్ చంద్రబాబు సీటు లో కూర్చుని కూర్చోక ముందే ప్రత్యేక హోదా విషయంపై మాట్లాడటం ఆసక్తికరంగా మారింది అనే చెప్పాలి. పోనీ ఐదేళ్లు తన వల్ల కాలేదు అనే మాట ఏమైనా చెపుతారా అంటే అదీలేదు.

Next Story
Share it