Telugu Gateway
Andhra Pradesh

జగన్ ఇక అంతేనా!

జగన్ ఇక అంతేనా!
X

వైసీపీ మొన్నటి ఎన్నికల్లో 151 సీట్ల నుంచి 11 సీట్లకు ఎందుకు పడిపోయింది అంటే రాజకీయం గురించి ఏ మాత్రం అవగాహన ఉన్న ఎవరైనా సరే ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతే అని చెపుతారు. వినటానికి సిద్ధంగా ఉంటే ఏ వైసీపీ నాయకుడిని అడిగినా, కార్యకర్తను అడిగినా జగన్ కు ఇదే సమాధానం వస్తుంది. ఎన్నికల్లో దారుణ ఓటమి చవిచూసిన తర్వాత నుంచి జగన్ మాటలు చూస్తుంటే ఆయన ఇప్పటికి వాస్తవాలు అర్ధం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించటం లేదు అనే చర్చ ఆ పార్టీ నాయకుల్లోనే సాగుతోంది. గురువారం నాడు నెల్లూరు జైలు కు వెళ్లి అక్కడ వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు. ఆ తర్వాత జగన్ మీడియాతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద సంచలనంగా మారాయి అనే చెప్పాలి. మొన్నటి ఎన్నికల్లో తాము ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు అని...చంద్రబాబు మోసపూరిత హామీల వల్ల కూటమి వైపు పది శాతం ఓటు బ్యాంకు షిఫ్ట్ అయి...తాము ఓటమి పాలు అయినట్లు చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమి తర్వాత అచ్చం కెసిఆర్, కేటీఆర్ లు ఏమి చెప్పారో ఇప్పుడు జగన్ కూడా అదే పని చేశారు. దీంతో తెలంగాణాలో కెసిఆర్, అక్కడ జగన్ లు ప్రజల్లో తమపై ఉన్న వ్యతిరేకతను ఏ మాత్రం గుర్తించటానికి సిద్ధంగా లేరు అనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది.

జగన్ ఓటమి తర్వాత పార్టీ నాయకులతో సమావేశం అయిన సమయంలో కూడా చంద్రబాబు పాపాలు పండుతున్నాయి అంటూ వ్యాఖ్యానించారు. ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుతీరి ఇంకా నెల రోజులు కూడా కాలేదు. కానీ జగన్ అప్పుడే చంద్రబాబు పాపాలు పండుతున్నాయి అనే థియరీనే నమ్ముకున్నారు. ఇదే మాట వచ్చే ఐదేళ్లు చెప్పుకుంటూ పోతారా లేక వాస్తవాలు తెలుసుకుని దిద్దుబాటు చర్యలు తీసుకుంటారో లేదు చూడాలి. ఫలితాల తర్వాత నుంచి జగన్ మాటలు చూస్తుంటే ఆయన వాస్తవాలు తెలుసుకోవటానికి సిద్ధంగా లేరు అనే అభిప్రాయంతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. మరో వైపు అరెస్ట్ అయి జైలు లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో జగన్ చేసిన వ్యాఖ్యలు మరింత షాకింగ్ గా ఉన్నాయనే చెప్పాలి. పిన్నెల్లి నాలుగు సార్లు వరసగా గెలిచాడు. ఇలా గెలిచాడు అంటే ఆ మనిషి మంచి వాడు కాబట్టి గెలిచాడు..మంచి వ్యక్తి కాబట్టే ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. అటు వంటి వ్యక్తిని తీసుకొచ్చి తప్పుడు కేసుల్లో ఈ మాదిరిగా బిగించటం మంచి పద్ధతి కాదు అంటూ జగన్ ఒక కొత్త థియరీ సిద్ధం చేశారు. అంటే జగన్ మాటలు చూసిన వాళ్లకు ఎవరికైనా వరసగా నాలుగు సార్లు గెలిచిన వాళ్ళు తప్పులు ఏమీ చేయరు..ఒక వేళ చేసిన వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి ఎలాంటి కేసులు పెట్టకూడదు అన్న చందంగా ఉంది ఆయన తీరు. జగన్ నెల్లూరు జైలు దగ్గర మాట్లాడిన మాటల్లో అత్యంత షాకింగ్ విషయం ఏమిటి అంటే...పాల్వాయి పోలింగ్ బూత్ ఘటనలో అన్యాయం జరుగుతుంది అని తెలిసే అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేశారు అని, కోర్టు లు కూడా ఈ విషయం గుర్తించి ఆయనకు ఈ కేసు లో బెయిల్ ఇచ్చింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అసలు ఎమ్మెల్యే ఈవీఎం పగలగొట్టడం ఎంతో సాధారణ విషయం అన్న చందంగా జగన్ మాట్లాడిన తీరు చూసిన వాళ్ళు అవాక్కు అవుతున్నారు అనే చెప్పాలి. జగన్ ఈ మాటలు మాట్లాడుతున్న సమయంలో ఒకింత షాక్ కు గురైన మాజీ మంత్రులు అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్ లు కూడా బ్లాంక్ గా చూస్తూ ఉండిపోయారు. నిజంగా ఆ బూత్ లో ఎమ్మెల్యే రిగ్గింగ్ చేసుకుని ఉంటే...ఆయనకు అక్కడ పరిస్థితి నిజంగా బాగుంటే ఎందుకు ఈవీఎం బద్దలు కొడతారా అని జగన్ ప్రశ్నించారు. అక్కడ అన్యాయం జరుగుతుంది అని తెలిసినపుడే లోపలికి వెళ్లి ఈవీఎం పగలగొట్టే కార్యక్రమం చేశాడు అంటూ తెలిపారు. తెలుగు దేశం పార్టీ ప్రజల్లో భయాందోళనలు కలిగేలా వ్యవరిస్తూ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలనీ చూస్తోంది అని జగన్ ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజలకు మంచి చేసి వల్ల ఆదరణ పొందాలి కానీ..ఇలా చేయటం సరికాదు అంటూ వ్యాఖ్యానించారు. చివరికి జగన్ తన ఓటమి విషయంలోనూ ఒక సొంత ఫార్ములా తయారు చేసుకోకుండా...తెలంగాణాలో కెసిఆర్ ఓటమి తర్వాత ఏమి చెప్పారో అచ్చం చంద్రబాబు మోసపూరిత హామీల వల్ల అటు వైపు మళ్లారు అని చెప్పటం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా జగన్ తీరు, వైసీపీ పాలనపై వ్యతిరేకతతోనే కూటమికి వాళ్ళు కూడా కనీసం కలలో కూడా ఊహించని రీతిలో 164 అసెంబ్లీ సీట్లు గెలిపించారు. కానీ జగన్ మాత్రం ఈ వాస్తవాన్ని గ్రహించటానికి సిద్ధంగా లేరు.

.

Next Story
Share it