పేపర్ లీక్ లను సమర్ధించిన ప్రతిపక్షం ఎక్కడైనా ఉందా?
ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈఎస్‌ఐలో డబ్బులు కొట్టేసిన నాయకుడిని విచారించడానికి వీల్లేదనే ప్రతిపక్షం, ఎల్లోమీడియాను ఎక్కడైనా చూశారా?. ప్రజలకు మంచి జరిగితే ఇలాంటి రాబందులకు అసలు నచ్చదంటూ జగన్ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం, జనసేనను ఉద్దేశించి ఆయన ఈ విమర్శలు గుప్పించారు. మంచి చేశామని మనలా చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. పదవ తరగతి పరీక్షల పేపర్లు వీళ్లే లీక్ చేస్తారు. పేపర్ లీక్‌ను సమర్థించిన ప్రతిపక్షాన్ని ఎక్కడైనా చూశారా? అని ప్రశ్నించారు. 'చంద్రబాబు మంచి చేశాడని చెప్పే ధైర్యం దత్తపుత్రుడితో పాటు ఎల్లోమీడియాకు కూడా లేదు. నిజాయితీ నిబద్ధతతో ప్రజల ముందుకు వస్తున్నాం. దుష్ట చతుష్టయం అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు.. నలుగురికి తోడు వీరి దత్తపుత్రుడు. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని వీరు జీర్ణించుకోలేరు.
ఏదైనా వ్యాధికి ఆరోగ్యశ్రీలో చికిత్స చేయించుకోవచ్చు.. కానీ ఈర్ష్య, కడుపు మంటకు వైద్యం లేదు. కొడుక్కి పచ్చి అబద్ధాలు, మోసాలతో ట్రైనింగ్ ఇస్తున్న చంద్రబాబు లాంటి తండ్రిని ఎక్కడైనా చూశారా? కోర్టుకి వెళ్లి మంచి పనులు అడ్డుకునే ప్రతిపక్షాన్నిఎక్కడైనా చూశారా?.' అని ప్రశ్నించారు చంద్రబాబు పాలనలో మత్స్యకారులను పట్టించుకోలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వ పాలనకు.. మన ప్రభుత్వ పాలనకు తేడా గమనించాలని కోరారు. కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్ళలో 'వైఎస్ఆర్ మత్స్యకార భరోసా' కార్యక్రమంలో మాట్లాడుతూ జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.10వేల చొప్పున ..1,08,755 మంది మత్స్యకారులకు రూ.109 కోట్లు జమ చేశారు. మత్స్యకార భరోసా కింద ఇప్పటివరకు రూ.418 కోట్ల సాయం అందించామని తెలిపారు.