Telugu Gateway
Andhra Pradesh

అయినా తీరు మారలేదు!

అయినా తీరు మారలేదు!
X

అసెంబ్లీ ఎన్నికల్లో జనం కొట్టిన దెబ్బ చాలదన్నట్లు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వరసగా సెల్ఫ్ గోల్స్ కొట్టుకుంటున్నారు. వై నాట్ 175 అంటూ ఎన్నికల ముందు రోజు వరకు మాట్లాడిన జగన్ కు కేవలం పదకొండు అంటే పదకొండు సీట్లు రావటంతో ఈవీఎం లపై విమర్శలు గుప్పించారు. ఇదే జగన్ 2019 ఎన్నికల్లో తాను 151 సీట్లతో గెలిచిన తర్వాత ఈవీఎం లు ఎంత బాగా పనిచేస్తాయో చెప్పి...తేడా ఉంటే వీవీ ప్యాట్ లో చెక్ చేసుకోవచ్చు అంటూ మాట్లాడి 2024 ఎన్నికల్లో తాను దారుణ ఓటమి చవిచూశాక వాటిపై అనుమానాలు వ్యక్తం చేయటం స్టార్ట్ చేశారు. ఏ పార్టీ ఆయినా ప్రజల తీర్పును గుర్తించి మసలుకుంటేనే మనుగడ ఉంటుంది. అలా కాకుండా దారుణంగా ఓడిపోయిన తర్వాత కూడా అంతా తాము అనుకున్నట్లే జరగాలి అంటే జరగదు అనే విషయాన్నీ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గుర్తిస్తున్నట్లు లేదు. వైసీపీ నేతలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అధికారం ఆయినా..ప్రతిపక్ష హోదా ఆయినా ప్రజలు ఇవ్వాలి కానీ..లేఖలు రాస్తే రాదు అనే విషయాన్ని జగన్ గుర్తించలేదు అనే చర్చ వైసీపీ నాయకుల్లో కూడా సాగుతోంది. వివిధ ఉదాహరణలను ప్రస్తావిస్తూ తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలని జగన్ తాజాగా ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి లేఖ రాశారు.

ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభలో ప్రజా సమస్యలపై గట్టిగా మాట్లాడే అవకాశం ఉంటుంది అని ప్రస్తావించారు. పది శాతం సభ్యులు ఉంటేనే వాళ్లకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే నిబంధన ఎక్కడా లేదు అంటూ తన లేఖలో పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును ఏ మాత్రం పట్టించుకోకుండా తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలంటూ లేఖ రాయటం పెద్ద సెల్ఫ్ గోల్ గా వైసీపీ నేతలు కూడా అభివర్ణిస్తున్నారు. అంతే కాదు జగన్ తన లేఖలో ప్రస్తావించిన అంశాలు ఎన్నో తప్పులు ఉండటం మరో విశేషం. 1984 లో అసలు లోక్ సభ సభ్యుడే కానీ పర్వతనేని ఉపేంద్ర కు లోక్ సభలో ప్రతిపక్ష నేత పదవి ఇచ్చినట్లు జగన్ తన లేఖలో ప్రస్తావించారు. ఆయన 1984 లో తొలిసారి రాజ్య సభ కు ఎన్నికయ్యారు. ఎక్కడవరకో ఎందుకు 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను బిఆర్ఎస్ లో చేర్చుకోవటంతో అప్పటివరకు అసెంబ్లీ లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మల్లు భట్టివిక్రమార్క ఆ హోదా ను కోల్పోయిన విషయం తెలిసిందే.

ఈ పని చేసింది కూడా జగన్ తాను మార్గదర్శిగా భావించే బిఆర్ఎస్ అధినేత కెసిఅరే. అంతే కాదు మొన్నటి సార్వత్రిక ఎన్నికలు జరిగే వరకు లోక్ సభలో పదిశాతం మంది సభ్యులు లేరు అనే కారణంతో లోక్ సభలో అతి పెద్ద ప్రతిపక్షం గా ఉన్న కాంగ్రెస్ పార్టీ కి కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వని విషయం జగన్ కు తెలియదా?. స్పీకర్ పై ఆయినా..ప్రభుత్వం ఆయినా సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి అంటే పదిశాతం మంది సభ్యుల సంతకాలు ఉంటేనే అది సాధ్యం అవుతుంది. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ కు ప్రజలు ఇచ్చిన సీట్ల ప్రకారం చూస్తే వచ్చే ఐదేళ్లలో జగన్ కనీసం ప్రభుత్వం పై అవిశ్వాసం పెట్టడానికి సరిపడినంత బలం కూడా లేదు. లోక్ సభలో అతి పెద్ద పార్టీ గా ఉన్న కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ కొంత మంది సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. ఎక్కడవరకో ఎందుకు ఇదే జగన్ అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ తాను డోర్ తెరిస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా ఉండేది కాదు అంటూ వ్యాఖ్యానించారు. అంతే కాదు అవునయ్యా నీకు తెలియకపోతే తెలుసుకో అంటూ చంద్రబాబును ఉద్దేశించి జగన్ అసెంబ్లీ లో మాట్లాడారు. ఇది ఒక్కటి చాలు జగన్ తన అవసరం కోసం ఎప్పటికప్పుడు ఎలాంటి ట్విస్ట్ లు ఇస్తాడో చెప్పటానికి.

Next Story
Share it