Telugu Gateway
Andhra Pradesh

రాజకీయాల్లో జగన్ ఓ వెరైటీ !

రాజకీయాల్లో జగన్ ఓ వెరైటీ !
X

టీడీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనంగా మారాయి. బహుశా దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా జగన్ లాగా ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉండరేమో. రాజకీయంగా చంద్రబాబు పై చాలా మంది చాలా విమర్శలే చేశారు. చేస్తారు కూడా. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన అంశాలు ఏమీ ఉండవు. కానీ తాజాగా జగన్ మోహన్ రెడ్డి చేసిన ఈ గ్లామర్ వ్యాఖ్యలు మాత్రం అటు సోషల్ మీడియా తో పాటు బయట కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని పరామర్శించి వచ్చిన తర్వాత జగన్ చేసిన వ్యాఖ్యలు చూసి జగన్ కు ఏమైంది అనే వాళ్ళు కూడా ఉన్నారు. చంద్రబాబు, లోకేష్ కంటే వల్లభనేని వంశీ గ్లామరస్ గా ఉన్నాడు..బాగా ఎదుగుతున్నాడు అంటే తట్టుకోలేడు తన సామజిక వర్గం నుంచి.

అందుకే కొడాలి నాని ని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశం.ఎందుకంటే చంద్రబాబు నాయుడు కంటే చక్కగా ఉంటాడు కాబట్టి. అవినాష్ కూడా ఎప్పుడో ఒక సారి టార్గెట్ అవుతాడు. ఎందుకంటే లోకేష్ కంటే చక్కగా ఉన్నాడు కాబట్టి. ఇది చంద్రబాబు నాయుడి మనస్తత్వం. ఆయన..ఆయన కొడుకు మాత్రం తన సామాజిక వర్గంలో లీడర్లు గా ఉండాలని చూస్తారు..ఇతరులు ఎవరిని ఎదగనివ్వరు అంటూ జగన్ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలతో సీరియస్ గా సాగాల్సిన ఈ పొలిటికల్ ఎపిసోడ్ ను జగన్ మోహన్ రెడ్డి మొత్తం కామెడీగా చేశారు అనే చర్చ వైసీపీ నేతల్లోనే సాగుతోంది. అయినా మగవాళ్ల అందం గురించి అందునా రాజకీయ నాయకుల అందం గురించి మాజీ సీఎం గా ఉన్న జగన్ మోహన్ రెడ్డి మాట్లాడటం ఏంటో అర్ధం కావటం లేదు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయినా ఏ పార్టీ అయినా రాజకీయ నాయకుల అందం చూసి టార్గెట్ చేస్తుందా అనే చర్చ కూడా తెర మీదకు వచ్చింది.

Next Story
Share it