ఇక చాలు జగన్ అన్న ఏపీ
జగన్ అడిగారు. జనం నొక్కారు. అయితే జగన్ కోరినట్లు మరో సారి అధికారంలో కొనసాగించేందుకు కాకుండా జగన్ ను ఇంటికి పంపించేందుకు చాలా గట్టిగా బటన్ నొక్కారు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే ఎవరికైనా ఇదే విషయం అర్ధం అవుతుంది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జగన్ పదే పదే ఇదే మాట ప్రచారం చేశారు. గత ఐదేళ్ల కాలంగా ప్రజల కోసం తాను వందల సార్లు బటన్ నొక్కాను అని...తన కోసం రెండు బటన్లు నొక్కాలని ఆయన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యానించారు. తన పాలనలో మేలు జరిగి ఉంటే తనకు ఓటు వేయాలని అంటూ జగన్ లబ్దిదారులను టార్గెట్ గా పెట్టుకునే విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఫలితాలు చూస్తే జగన్ మాటలను జనం నమ్మినట్లు కనిపించటం లేదు అనే చెప్పొచ్చు. 2019 ఎన్నికల్లో సునామిలాగా ఏకంగా 50 శాతం ఓటింగ్ తో రికార్డు స్థాయిలో 151 సీట్లు దక్కించుకుని ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద సంచలనం నమోదు చేశారు. గత ఎన్నికల్లో ఎంతటి ఘన విజయం దక్కించుకున్నారో..తన ఐదేళ్ల పాలనతో మొత్తం రివర్స్ అయ్యేలా చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే ఇందులో ప్రధానంగా చెప్పాల్సింది జగన్ స్వయంకృతాపరాధం అనే అభిప్రాయం వైసీపీ నేతల్లోనే వ్యక్తం అవుతోంది.
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ అధినేత ఎన్నో ప్రయోగాలు చేశారు. అయినా సరే అవేమీ సత్ఫాలితాలను ఇవ్వలేకపోయాయి. జగన్ నమ్ముకున్న అంశాల్లో బటన్ తో పాటు సోషల్ ఇంజనీరింగ్. ఇదే విషయంపై పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసుకున్నారు. అవేమీ ఎన్నికల్లో వైసీపీ ని గట్టు ఎక్కించలేకపోయాయి . ఈ ఎన్నికల్లో జగన్ మొత్తం 81 మంది అభ్యర్థులను మార్చారు. కొంతమంది అసలు టికెట్స్ కట్ చేస్తే మరికొంత మంది నియోజకవర్గాలు మార్చి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నం చేశారు. ఇంత పెద్ద ఎత్తున మార్పులు చేసినా కూడా లాభం లేకుండా పోయింది. తాను ఎంతో మంచి పాలన అందించానని ...తనపై నమ్మకం ఉంటే ప్రజలు తనకు ఓటు వేస్తారు అంటూ పలు ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు జగన్. వైసీపీ ఎన్నికల ప్రచారం లో మా నమ్మకం నువ్వే జగన్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. అయితే ప్రజల తీర్పు చూస్తే మాత్రం జగన్ ను మేము నమ్మం అని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు చెప్పినట్లు అయింది అనే చెప్పాలి. జగన్ మా నమ్మకం కాదు కదా..ఇక చాలు జగన్ అని చెప్పినట్లు అయింది అన్నట్లు ఈ ఫలితాలు ఉన్నాయి. పదకొండున్నర సమయానికి కూటమి పార్టీలు ఏకంగా 160 సీట్లలో లీడ్ లో ఉంటే..అధికార వైసీపీ కేవలం 14 సీట్లలో లీడ్ లో ఉంది అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు.