జగన్ సర్కారులో ఇంత డొల్లతనమా ?!
రాజధానితో ఆటలు...ఒక సారి సాదా సీదా బిల్లులు..ఇప్పుడు పక్కా బిల్లులా!
సజ్జల వ్యాఖ్యలపై అధికారుల విస్మయం
ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొనే ముందు అన్ని విషయాలు ఒకటికి పది సార్లు ఆలోచించాలి. నిపుణుల సలహాలు తీసుకోవాలి. అప్పుడే ముందుకు వెళ్ళాలి. అందులో ముఖ్యమంత్రి నోటినుంచి వచ్చిన మూడు రాజధానుల వంటి కీలక అంశంపై నిర్ణయం అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణా రెడ్డి చేసిన వ్యాఖలు చూసి అధికారులు చూసి అవాక్కు అవుతున్నారు. ఒక సరైన పద్దతి ప్రకారం, లోతైన, మరింత పకడ్బందీగా మూడు రాజధానుల చట్టం తీసుకొస్తాం అని ప్రకటించారు సజ్జల తాజాగా . ఒక వైపు ఈ అంశం సుప్రీంకోర్ట్ లో విచారణ జరుగుతున్న సమయంలో అయన ఇలాంటి ప్రకటన చేయటంపై ఐఏఎస్ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక ఎత్తు అయితే మరి మూడు రాజధానుల కోసం జగన్ సర్కారు ముందు తీసుకొచ్చిన బిల్లులు ఆషామాషీగా, ఏదో అలా సాదాసీదా బిల్లులు తెచ్చారా..దీనిపై ఏ మాత్రం కసరత్తు చేయాలేదా అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి సందేహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తరుపున మాట్లాడే సమయంలో ప్రతి విషయం ఆచితూచి స్పందించాల్సి ఉంటుంది అని.కానీ తాజాగా సజ్జల చేసిన వ్యాఖలు ప్రభుత్వ డొల్ల తనాన్ని తెలియచేస్తున్నాయనే వ్యాఖలు వినిపిస్తున్నాయి. హై కోర్ట్ లో మూడు రాజధానుల అంశంపై తీర్పు వచ్చే ముందు ప్రభుత్వం ఆగమేఘాల మీద బిల్లులు ఉపసంహరించుకుంది. ఆ తర్వాత హై కోర్ట్ విభజన చట్టం ప్రకారం ఒక సారి రాజధాని పై నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ దీనిపై అసెంబ్లీకి నిర్ణయం తీసుకొనే అధికారం లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. హై కోర్ట్ తీర్పు లోని పలు అంశాలపై తాజాగా సుప్రీంకోర్ట్ స్టే ఇచ్చింది. అయితే అత్యంత కీలకం అయిన రాజధానిగా అమరావతి కొనసాగుతుంది అనే అంశంపై మాత్రం సుప్రీం స్టే ఇవ్వలేదు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాజధానుల విషయంలో ముందుకు వెళ్లాలంటే ఇదే అత్యంత కీలకం అన్న విషయం తెలిసిందే. కానీ ఇవేమి పట్టించుకోకుండా ఈ సారి పక్కా చట్టం తెస్తాం అంటే సాధ్యం అవుతుందా అన్న చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది. ఈ మొత్తం వ్యవహారం ప్రభుత్వ డొల్ల తనాన్ని తెలియచేస్తుంది అనే చర్చ సాగుతోంది.