కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబు కు సీఐడీ నోటీసులు
అమరావతి భూముల వ్యవహారంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడికి సీఐడీ నోటీసులు జారీ చేసిన అంశంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. 'అసైన్డ్ భూములను రైతుల ఆమోదంతో తీసుకుని రాజధాని కోసమే ఉపయోగించాం. దేశ చరిత్రలో ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఎప్పుడైనా ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు పెట్టారా? మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎస్సీనా, ఎస్టీనా? ఆయన ఫిర్యాదు చేయగానే ఎస్సీ ఎస్టీ చట్టం కింద ఏ విధంగా కేసు పెడతారు? అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. రాజధానిలో అసైన్డ్ రైతులకు కూడా జరీబు రైతులకు ఇచ్చిన ప్యాకేజీనే ఇచ్చాము. ల్యాండ్ పూలింగ్ 2015లో జరిగితే దానిపై ఇప్పుడు సీఐడీ నోటీసులు అంటూ కేసు పెట్టడం కక్ష సాధింపుకాదా? జగన్ రెడ్డి నేటికీ సొంత ప్రయోజనాల కోసం పేదల అసైన్డ్ భూములు వాడుకుంటున్నారు. అసైన్డ్ భూముల్లో ఇళ్లు కట్టుకున్న చరిత్ర జగన్ రెడ్డిది. ఇళ్ల స్థలాల పేరుతో వందలాది మంది అసైన్డ్ భూములను లాక్కున్నారు. దశాబ్ధాలు తరబడి ఇడుపులపాయలో అసైన్డ్ భూములు వాడుకుంటన్న చరిత్ర జగన్ ది. వాన్ పిక్ భూములు లాక్కుని రైతులకు పరిహారం నేటికీ ఇవ్వలేదు.
రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబుపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ ను చేపట్టాం. ఎక్కడా సొంత ప్రయోజనాల కోసం తీసుకోలేదు. రైతుల అనుమతితోనే ఆ భూమలు సేకరికంచడం జరిగింది. సోలార్ కంపెనీలు అవసరాలకు అసైన్డ్ భూములు బలవంతంగా లాక్కోవడానికి జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చిన విషయం వాస్తవం కాదా? పేదలు ఎంతో కాలం నుండి సాగుచేసుకొంటున్న అసైన్దు భూములను దౌర్జన్యంగా గుంజుకొని ఇళ్లస్థలాలు ఇస్తున్నారు. ఇడుపులపాయలో అసైన్డ్ భూములు 700 ఎకరాలను 30 ఏళ్లు అనుభవించారు. ఆ విషయం బయటపడటంతో 610 ఎకరాలు ప్రభుత్వానికి స్వాధీనం చేస్తున్నానని అసెంబ్లీలో వై.ఎస్. చెప్పారు. ఆ తరవాత 300 ఎకరాలే స్వాధీనం చేస్తున్నానని మాట మార్చలేదా? అసైన్డు భూముల బదిలీ నిషేధ చట్టాన్ని 2007లో సవరించి ఆర్డినెన్స్ ద్వారా అమలులోకి తెచ్చింది మీతండ్రి వైఎస్. కాదనగలరా? ఫలితంగా పేదల భూములు లాక్కొని తమకు ఇష్టమైన వారికి కట్టబెట్టుకొనే వీలు కలిగించగలిగారు.' అని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.